Saturday, November 23, 2024

Delhi | చంద్రబాబు అరెస్ట్ సబబు కాదు : బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: స్కిల్ ఇండియా కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ పోలీసులు అరెస్టు చేసిన తీరును భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ తప్పుబట్టారు. ఎఫ్.ఐ.ఆర్ లో పేరు చేర్చకుండా, నోటీసులు ఇవ్వకుండా, వివరణ అడగకుండా అరెస్టు చేయడాన్ని బీజేపీ తప్పుబడుతోందని, ఈ అరెస్టు సబబు కాదని వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఈ మాటలన్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద సెప్టెంబర్ 13న బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, కానీ కేసీఆర్ పాలనలో నియామకాలు లేక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి సందర్భంగా కేంద్రం రూ. 13 వేల కోట్లతో ప్రకటించిన పథకాన్ని ప్రారంభిస్తామని, ఆ పథకం గురించి ప్రజలందరికీ తెలియజేశేలా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో ‘ధన్యవాద్ మోడీ’జీ పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని డా. లక్ష్మణ్ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement