ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహార సరళిపై ఆయన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. పోలీసులు నిరంకుశ పాలకుల ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారని, ఇలాంటి సమయాల్లో ప్రజలకు కావాల్సింది ఆదుకునే ప్రభుత్వం, స్నేహ హస్తం అందించే పోలీసులు అని వివరించారు. కానీ, అందుకు విరుద్ధమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు.
విశాఖలో ఇటీవల లక్ష్మీ అపర్ణ అనే దళిత యువతి, మరో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో ప్రజల హక్కులను హరించే విధంగా పోలీసుల తీరు ఉందని పేర్కొన్నారు. ఒక రాష్ట్రాధిపతిగా వ్యవస్థను చక్కదిద్దే దిశగా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్‌ను చంద్రబాబు కోరారు.