న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తీరు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తున్నారని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహా రావు అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కే. చంద్రశేఖర్ రావు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జీవీఎల్ ఈ విధంగా స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉనికి కోల్పోతోందని, ఈ తరుణంలో జాతీయ రాజకీయాల్లో ఏదో చేసేస్తానన్నట్టు ఆయన భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించారని, కానీ ఎన్నికల ఫలితాలు అందరికీ తెలిసినవేనని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఉండేది జూబ్లీహిల్స్‌లోనేనని, కారేసుకుని వెళ్లి కనుక్కోవచ్చని జీవీఎల్ సూచించారు. జాతీయ రాజకీయాల్లో ఎవరైనా ప్రయత్నించవచ్చని, అందులో తప్పేమీ లేదని, కానీ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి విజయవంతమయ్యే పరిస్థితి మాత్రం లేదని అన్నారు. ఏదో సాధించాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తే, ఉన్న రాష్ట్రంలో కూడా అధికారం దక్కకుండా పోతుందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేది ఎన్డీయేనే అన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..