ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక రేపు (జూలై 4) ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఉదయం 10.15 గంటలకు వీరి భేటీ జరగనుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఇతర అంశాలను ప్రధానికి చంద్రబాబు వివరించనున్నారని తెలుస్తోంది. మోదీతో భేటీ అనంతరం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఇతర కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం.. పారిశ్రామిక రాయితీలు, మౌలిక వస్తువుల కల్పన ప్రాజెక్ట్ వంటి అంశాల అమలుపై సహాయం అందించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బాబు నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఉన్నారు.