న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు పొడుస్తున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) – జనసేన పొత్తుల్లో ఉండగా.. తెలుగుదేశం కూడా ఈ కూటమితో జతకట్టే దిశగా అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజా ఢిల్లీ పర్యటనతో మరింత స్పష్టత వచ్చింది. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఎన్టీ రామారావు స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం రాత్రే ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు, రాష్ట్రపతి భవన్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో ముచ్చటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన చంద్రబాబు, ఏపీలో పొత్తులు సహా అనేకాంశాలపై వివరంగా మాట్లాడారు.
గెలుపే కాదు.. రాష్ట్ర పునర్నిర్మాణం కూడా…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని, కానీ అప్పటి నుంచి అరాచక పాలన మొదలైందని చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పటి వరకు తెలంగాణతో అన్ని విధాలా పోటీపడుతూ పురోగమనంలో ఉన్న రాష్ట్రం కాస్తా తిరోగమనంలోకి వెళ్లిపోయిందని అన్నారు. జగన్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, కాకపోతే బహిరంగంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో వ్యక్తపరుస్తారని, తెలుగుదేశం పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇంత భరోసా ఉన్నప్పుడు జనసేన, బీజేపీ వంటి పార్టీలతో పొత్తు ఎందుకు ఆశిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. పొత్తు కేవలం గెలుపు కోసం మాత్రమే కాదని, సర్వనాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం కూడా పొత్తులు అవసరమని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమేనని చంద్రబాబు అన్నారు. 2019లో తాము ఎన్డీఏ వీడి బయటకు రావడానికి ప్రజల భావోద్వేగాలతో ముడిపడ్డ ప్రత్యేక హోదా ఒక్కటే కారణమని, అంతకు మించి ఎన్డీఏను వీడేందుకు మరే కారణమూ లేదని తెలిపారు. జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటముల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందని, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌తో పాటు ఎన్డీఏ, యూపీఏల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉందని గుర్తుచేశారు. కూటములు, పొత్తులు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, కానీ రాష్ట్రాభివృద్ధి – తద్వారా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలన్నదే తన ధ్యేయమని తెలిపారు.
పొత్తులకు మేం అనువుగా ఉన్నాం
ఏపీలో పొత్తుల గురించి విలేకరులు గుచ్చి, గుచ్చి ప్రశ్నించగా.. పరిస్థితులకు అనుగుణంగా సమయానుకూల నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. పొత్తులకు తెలుగుదేశం పార్టీ అనువుగా ఉందని, అయితే పొత్తుల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో పొత్తుల ప్రస్తావన ఉంటుందని, ఎవరితో పొత్తులుంటాయో మీరే చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు. పొత్తులు లేవు అని తాను చెప్పనని, అలా చెప్పి రేపు పొత్తులు పెట్టుకుంటే మాట మార్చానని మళ్లీ తనను నిందిస్తారని చంద్రబాబు అన్నారు. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి పొత్తులుంటాయని చెప్పారు.
ముందస్తు ఎన్నికలకు ఆస్కారం
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ గ్రాఫ్ రోజురోజుకూ దారుణంగా పడిపోతోందని, ఈ విషయం ఆయనకు కూడా తెలుస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గ్రాఫ్ మరింత పడిపోకముందే ఎన్నికలకు వెళ్లాలి అనే ఆలోచనలో వైఎస్సార్సీపీ అనుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏర్పాట్ల కసరత్తు చేపట్టిందని, కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలు తెలంగాణతో పాటు వస్తాయా.. లేదా అన్నది చెప్పలేమని అన్నారు.
తెలంగాణలోనూ పోటీ చేస్తాం
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీకి ఉన్న అనుకూల, ప్రతికూలతలు, బలాబలాల గురించి లోతుగా అధ్యయనం చేసేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ వేశామని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తాము ఎక్కడెక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకుంటామని అన్నారు. అయితే తెలంగాణలో పొత్తుల గురించి ప్రశ్నించగా.. సమయం ఇప్పటికే మించిపోయింది అన్నారు.
ఏపీ, తెలంగాణ – నార్త్ కొరియా, సౌత్ కొరియా
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తొలి ఐదేళ్లు తెలంగాణతో పోటీపడుతూ రాష్ట్రాభివృద్ధి పరుగులు పెట్టించానని చంద్రబాబు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం సర్వనాశనమైందని, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పొంతన లేనంత వ్యత్యాసం ఉందని అన్నారు. నార్త్ కొరియా, సౌత్ కొరియా మాదిరిగా తెలుగు రాష్ట్రాలున్నాయని చంద్రబాబు అభివర్ణించారు. విభజన అనంతరం రాష్ట్రాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయాలని భావించానని, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని దుయ్యబట్టారు. తన హాయంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశానని, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. పోలవరం పూర్తిచేసి నదులను అనుసంధానం చేస్తే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచేదని అన్నారు.
తనపై ఎన్ని కేసులున్నాయో తెలుసుకోవడం కోసం ఆర్టీఐ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. జగన్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నందుకు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తనపైనే భౌతిక దాడులు చేస్తూ.. తనపైనే కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాజకీయంగా తన ముందు జగన్ అనుభవం ఎంత అని అన్నారు. రాష్ట్రానికి ఉన్న పెద్ద సమస్య జగనేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ను గద్దె దించాలని అన్నారు. జగన్ తన సొంత బాబాయిని చంపి నిందలు తనపై మోపారని చంద్రబాబు అన్నారు. ఎంపీ రఘురామకృష్ణ రాజును సీఐడీ చిత్రహింసలు పెడుతుంటే ఆ వీడియోలు చూసి శాడిస్టిక్ ఆనందం పొందిన వ్యక్తి జగన్ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
విపక్ష కూటమికి నాయకత్వం లేదు
దేశంలో రాజకీయ పార్టీలు ఇటు ఎన్డీఏ కూటమి లేదా అటు ఇండియా కూటమిలో ఉంటున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికే సానుకూల సంకేతాలిచ్చారు. ఇండియా కూటమికి నాయకత్వం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమికి బలమైన నాయకత్వమే అనుకూలాంశమని అన్నారు. దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికే లేదని అన్నారు. కర్ణాటకలో మాత్రమే బలంగా కనిపిస్తోందని, తెలంగాణలో చారిత్రక కారణాల కారణంగా ఆ పార్టీకి ఉనికి మాత్రం ఉందని అన్నారు. కేరళలో కూటమిలో భాగంగానే ఉందని గుర్తుచేశారు. మరోవైపు తన వయస్సు గురించి విమర్శలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే, సింగపూర్ ప్రధాని వయస్సు ఎంతో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. మోడీ వయస్సు గురించి మాట్లాడే దమ్ము వైఎస్సార్సీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.
దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది.. జనాభా నియంత్రణ కాదు.. మానవ వనరులను పెంచాలి
తాను దేశాభివృద్ధిలో, ప్రగతిలో పోషించిన పాత్ర పట్ల తనకు సంతృప్తిగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన సంతృప్తి తనకు చాలని అన్నారు. రూ. 500, ఆపై కరెన్సీ నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించానని, అలా చేస్తే ఎన్నికల్లో నగదు పంపిణీ ఉండదని.. తద్వారా మంచి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని వ్యాఖ్యానించారు. భారతదేశం టెక్నాలజీలో చాలా అగ్రస్థానంలో ఉందని, డీప్ డ్రైవ్ టెక్నాలజీస్ వినియోగంలోకి వస్తున్నాయని చెప్పారు. వ్యవసాయం, హెల్త్ రంగాల్లో ఈ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ లో అనంతమైన సౌర శక్తి ఉందని, సౌర, పవన విద్యుత్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెరిగితే.. చమురు దిగుమతుల భారం తగ్గి ప్రగతి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు.
భారత్ యువశక్తి సహా డెమోగ్రఫిక్ సానుకూలాంశాలు చాలా ఉన్నాయని అన్నారు. దేశం అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలు పిల్లలు వద్దని అనుకుంటారని, అప్పుడు యువ శక్తి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనాభా పెరగాలని కోరుకుంటూ.. పిల్లల్ని కనాలి అంటూ ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ఉంటే భారత్ ఎప్పటికీ యువశక్తితో ఉంటుందని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని మానిటర్ చేసేలా సాంకేతికత వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
తద్వారా ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేలా చేయవచ్చని అన్నారు. అదాని, అంబానీ, టాటా అంటూ కొందరికే ఆస్తులు సృష్టించడం కంటే ప్రతి కుటుంబానికి ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి భారతీయుడు ప్రపంచావసరాలకు తగ్గట్టు ఆలోచించాలని సూచించారు. భారత్‌లో కూర్చుని గ్లోబల్ అవసరాలు తీర్చే ఉద్యోగాలు, వ్యాపారాలు చేయవచ్చని అన్నారు. భారతీయులు భూమి మీద ఎక్కడైనా బ్రతకగలరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారతీయులకు ఉన్న గొప్ప లక్షణం ఎక్కడైనా నిలదొక్కుకోవడమే అన్నారు. భారతీయుల శక్తి సామర్థ్యాలు, కుటుంబ విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలను చూసి అమెరికన్లు అసూయపడుతున్నారని చంద్రబాబు అన్నారు.