అమరావతి: కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలోనే చంద్రబాబునాయుడు ఓడిపోయారంటూ వైసిపి నేతలు చేస్తున్న ప్రచారంపై స్పందిస్తూ, కుప్పంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొంటే అధికారులు ఏమి చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో వైసిపి గెలిచిందని ఆరోపించారు.. ‘కుప్పం ప్రజలు నా కుటుంబ సభ్యులు…దాన్ని కలుషితం చేస్తారా!? నేను రాజీనామా చెయ్యాలి అంటున్నారు….ఇలాంటి రాజకీయ నేతల కోసం నేను రాజీనామా చెయ్యాలా!?’ అని ప్రశ్నించారు. కుప్పంలో తన పిఏ మీద కూడా కేసులు పెట్టారన్నారు. ఎన్నికల సంఘం, కోర్టు చెప్పినట్లు కౌంటింగ్‌ను ఎందుకు రికార్డ్ చెయ్యలేదని ప్రశ్నించారు. కౌంటింగ్ హాల్‌లో పోలీసులకు ఎం పని అని నిలదీశారు. డబుల్ డిజిట్ ఓట్ల మెజారిటీతో గెలిచిన చోటా రీకౌంటింగ్ ఎందుకు చేశారన్నారు. రాత్రి 10 గంటల తరువాత గెలుపు మార్చేశారని ఆరోపించారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిందని అన్నారు. టీడీపీ గళం ఎత్తడం వల్లనే ప్రజలు ఓటింగ్ వరకు వచ్చారని, మొదటి విడతలో 38 శాతం, రెండో విడతలో 39, మూడో విడతలో 40 శాతం స్థానాలు టీడీపీ గెలుచుకుందన్నారు. మూడు విడతల్లో పోలింగ్ జరిగిన చోట్ల 38-40 శాతం గెలుచుకున్నామన్నారు. వాలంటీర్లు, అధికారులు అడుగడుగునా బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజాదరణ ఉన్నవాళ్లే ఎన్నికల్లో గెలుస్తారన్నారు. కానీ ఏపీలో ఇప్పుడు జరుగుతున్నదేంటి?.. ఏకగ్రీవాలను ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.. అభ్యర్థులను బెదిరిస్తున్నారన్నారు.. వాలంటీర్లతో బెదరింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు నిలిపేస్తామంటున్నారని, వాలంటీర్లు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తున్నారని, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పులివెందుల, పుంగనూరు, మాచర్లలో వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా నిలిచిపోతారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement