Friday, November 22, 2024

ప‌ల్లాను ప్ర‌శంసించిన చంద్ర‌బాబు..

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత పల్లా దీక్షను పోలీసులు భగ్నం చేసి షీలానగర్‌లోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆస్పత్రికి చేరుకుని పల్లాను పరామర్శించారు. పార్టీ అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.. మీరు చేస్తున్న పోరాటం అంద‌రికీ స్ఫూర్తి దాయకం అంటూ పల్లాని ప్ర‌శంసించారు . కాగా, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే పల్లా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేస్తున్నారు. హాస్ప‌ట‌ల్లోనే త‌న దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు..  అనంతరం ఉక్కు పరిరక్షణ కమిటీ దీక్ష శిబిరానికి వెళ్లిన చంద్రబాబు స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం జగన్‌కు తెలియకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఎలా సాధ్యమవుతుందని  ప్రశ్నించారు. ఏపీకి ఆర్థిక రాజధాని ఎప్పటికీ విశాఖయేనని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులు విశాఖలో భూముల వ్యాపారం చేసుకుంటూ పారిశ్రామిక అభివృద్ధిని గాలికొదిలేశారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ను దోచుకోవాలన్నదే వైసీపీ ఆలోచన అని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని పేర్కొన్నారు.  స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు టీడీపీ పోరాడుతుందని అన్నారు. 18న టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త నిరసనల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement