న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో తెగదెంపులు చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారిగా కమలదళ అగ్రనేతలతో భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు, రాత్రి గం. 9.00 సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. కాసేపటికే బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ బీజేపీతో చెలిమి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.
ఒక దశలో తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా నిలిచిన రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి మరీ రాయబారం సాగించినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు సైతం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని బీజేపీకి దగ్గర చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ఏకైక లక్ష్యమని చెబుతూ వచ్చిన బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుల కోసం రాయబారం సాగించినట్టు తెలిసింది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీని మళ్లీ దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఓవైపు స్వపక్షంలో టీడీపీ పొత్తు కోరుకునేవారు, మరోవైపు మిత్రపక్షం జనసేన ఒత్తిడి, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ పంపుతున్న మైత్రి సందేశాల ఫలితంగా కాషాయ దళపతులు ఎట్టకేలకు చంద్రబాబు నాయుడుతో సమావేశానికి తలూపినట్టు తెలిసింది. ఆ క్రమంలోనే తాజా సమావేశానికి మార్గం ఏర్పడింది.
కర్ణాటక ఫలితంతో మారిన పరిణామాలు
దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అధికారం అందించిన ఏకైక రాష్ట్రం కర్ణాటకలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది. ఈ ఓటమితో ‘బీజేపీ ముక్త్ దక్షిణ్ భారత్’ (బీజేపీ రహిత దక్షిణ భారతదేశం) పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివర్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో గెలుపొందాలంటే ఇప్పుడున్న బలం సరిపోయేలా లేదని అధిష్టానం గ్రహించింది. పైగా కర్ణాటక గెలుపు ఊపులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ను ఢీకొట్టే స్థాయిలో బీజేపీ మాత్రమే ఉందన్న రాజకీయ వాతావరణం కాస్తా మారి బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీయే సవాల్ విసరగలదన్న పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉందని తెలుగుదేశం నేతలతో పాటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా చెప్పినట్టు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం మద్ధతుదారులు గెలుపోటములను కూడా నిర్ణయించే స్థాయిలో ఉన్నారని కొన్ని గణాంకాలు చూపించినట్టు తెలిసింది. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దగ్గరైతే బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అని మొదట్లో తెలంగాణ బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం కారణంగా సెంటిమెంట్ రివర్స్ అయ్యి ఓటమి పాలైందన్న విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. బీజేపీకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన తొలుత వ్యక్తమైంది.
అయితే తెలంగాణ సెంటిమెంటుపై ఇన్నాళ్లూ రాజకీయాలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడం, ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేయడంతో ఇకపై తెలంగాణ సెంటిమెంటుపై ఆ పార్టీ రాజకీయాలు చేయడం సాధ్యం కాదని బీజేపీ నేతలు భావించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ దగ్గరైతే తెలుగురాష్ట్రాల్లో ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొన్ని మీడియా సంస్థలు, సమాజాన్ని ప్రభావితం చేయగల సినీ ప్రముఖులు తమకు అనుకూలంగా మారతారని బీజేపీ లెక్కలు వేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పొత్తు రాయబారాలకు తెలంగాణ బీజేపీ నేతలు సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఏపీలో సై – తెలంగాణలో నై
పొత్తులపై తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పటికీ పొత్తులు, సీట్ల సర్దుబాటును ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం చేసే ఆలోచనలో కమలనాథులు ఉన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏపీలో పొత్తుల కారణంగా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం ఓటుబ్యాంకు బీజేపీకి అండగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. అలా కాకుండా తెలంగాణలో కూడా పొత్తులు పెట్టుకుంటే ఫలితం అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని అధిష్టానం పెద్దలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఒకప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా ఉన్న బీసీ ఓటుబ్యాంకు ఆ పార్టీ బలహీనపడ్డ తర్వాత బీఆర్ఎస్ వైపు మళ్లింది.
అలాగే తెలుగుదేశం పార్టీతో విడదీయలేనంత అనుబంధం కలిగిన ఆంధ్రా సెటిలర్లలో ఒక సామాజికవర్గం కూడా కేసీఆర్‌కు మద్ధతివ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అదే తెలుగుదేశం పార్టీతో స్నేహం కుదిరితే ఈ వర్గాలు బీజేపీకి దగ్గరవుతాయని కూడా భావిస్తున్నారు. పైపెచ్చు తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థలు ఆ పార్టీ నుంచి వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, పొత్తుల ప్రభావంతో ఈ పరిస్థితిలో కూడా మార్పు వస్తుందని టీ-బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే జనసేనతో కలిసి బలపడాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదు. మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలుగుదేశంతో కలిస్తే తప్ప జగన్‌ను ఎదుర్కోలేమన్నట్టుగా వ్యవహరిస్తోంది. జగన్ ఓడించడం కోసమైనా సరే 2014 తరహాలో తెలుగుదేశం – బీజేపీ – జనసేన కలిసి పోటీ చేయాలని పట్టుబడుతోంది. తెలుగుదేశంతో పొత్తు కారణంగానే బీజేపీ ఆ రాష్ట్రంలో బలపడలేకపోతుందన్న భావన పార్టీ నేతల్లో ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేసినా ఉపయోగం లేదని గ్రహించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు ప్రధాన పార్టీలు కేంద్రంలో బీజేపీ సర్కారుకు అన్ని విషయాల్లోనూ మద్ధతిస్తున్నాయి.
ఈ పరిస్థితిలో ఓ ఒకరి పక్షాన నిలిచినా.. మరొకరిని దూరం చేసుకున్నట్టే అవుతుందని కూడా కమలనాథులు ఇంతకాలం భావించారు. మొత్తంగా మొదట జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రయోజనం కల్గించేలా తెలుగుదేశం సహకరిస్తే.. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కల్గించేలా తాము సహకరిస్తామని బీజేపీ అగ్రనాయకత్వం చెబుతున్నట్టుగా తెలిసింది.
అండమాన్‌లో ఇప్పటికే మొదలైన చెలిమి
తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుల గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం జరగనప్పటికీ.. అండమాన్ లో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తెలుగుదేశం, బీజేపీలు పంచుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేసిన రెండు పార్టీలు.. ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం 24 వార్డుల్లో బీజేపీ 10, కాంగ్రెస్ 10, తెలుగుదేశం 2, ఒక స్వతంత్ర అభ్యర్థి, డీఎంకే ఒక వార్డుల్లో గెలుపొందాయి. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే సగం కంటే ఎక్కువ మద్ధతు కావాలి.
తమకున్న 10 మంది కౌన్సిలర్లకు తోడు ఒక స్వతంత్ర అభ్యర్థిని కలుపుకున్నప్పటికీ ఉపయోగం లేదు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్ధతిచ్చింది. ఇదొక శుభపరిణామం అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేయడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. గత నెలలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవన్నీ శనివారం నాటి చర్చలకు మార్గం వేశాయని రెండు పార్టీల్లోని నేతలు చెబుతున్నారు.