Friday, November 22, 2024

Delhi: చంద్రబాబు, కరవు కవలలు.. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది కాబట్టే లోకేశ్ నెల్లూరు నుంచి తిరిగి వెళ్లగలిగారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన అన్ని రాష్ట్రాల సహకార మంత్రుల సదస్సులో పాల్గొన్న ఆయన, అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్‌ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌తో కలిసి ఏపీ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత సహాకార సదస్సులో చర్చించిన అంశాల గురించి వివరిస్తూ.. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సహకార చట్టాలు అమలవుతున్నాయని, ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఏకరూపత తీసుకురావాల్సిన అవసరముందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా సూచించినట్టు వెల్లడించారు.

ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను విస్తరించాలన్న ప్రతిపాదన సైతం ఈ సదస్సులో చర్చకొచ్చిందని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చే దిగుబడులు, సేంద్రీయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌, మార్కెటింగ్‌, ఎగుమతులకు సంబంధించి అన్ని రకాలైన చర్యలు తీసుకోవడానికి కొన్ని సంస్థలను ఐడెంటిఫై చేస్తున్నట్లు అమిత్‌ షా ఆ సదస్సులో పేర్కొన్నారు. కేవలం సహకార సంఘాలతోనే కాకుండా, దాని పరిధిని విస్తరించి, గృహ నిర్మాణ, మత్స్య, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన శాఖలకు కూడా కోపరేటివ్‌ రంగాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనతో పాటు కంప్యూటరైజేషన్‌ విధానంతో రాష్ట్రాల్లో ఉన్న ఆప్కాబ్‌లు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను అనుసంధానం చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. ప్రతి రాష్ట్రంలో ఒక కోఆపరేటివ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, నైపుణ్యం కల్గిన మానవ వనరులను ఉత్పత్తి చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందని అన్నారు. జాతీయ స్థాయిలో ఒక మల్టీ ఎక్స్‌పోర్ట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సహకార రంగంలో ఎగుమతులకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడ్డ సహకార వ్యవస్థను రాష్ట్రాల్లో బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరినట్టు మంత్రి కాకాణి వెల్లడించారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగినప్పటికీ డీసీసీబీలు మాత్రం విభజనకు ముందునాటి జిల్లా ప్రకారమే ఉన్నాయని, ఆర్బీఐ అనుమతి తీసుకున్న తర్వాత వీటి విభజన కూడా చేస్తామని చెప్పారు. గతంలో నష్టాల్లో ఉన్న డీసీసీబీ (జిల్లా కో-ఆపరేటివ్‌ సహకార బ్యాంక్‌), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను జగన్ అధికారంలోకి వచ్చాక లాభాల బాటలోకి తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. నిధులు ఇచ్చి రూ. 290 కోట్లకు పైగా ఇన్ఫ్యూజన్ క్యాపిటల్ కింద సహకార బ్యాంకులకు అందించడంతో నష్టాల నుంచి లాభాల బాట పట్టడానికి వీలుపడిందని వివరించారు. నాబార్డు కానీ ఆర్‌బీఐగానీ సహకరించాలంటే బ్యాంకులు ఆర్థికంగా పటిష్టంగా ఉండాలని, అందుకోసమే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. నీతి ఆయోగ్‌, ప్రపంచ బ్యాంకులు దగ్గర నుంచి ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను ప్రశంసిస్తున్నాయని తెలిపారు.

ఏటా సగటున 14 లక్షల టన్నుల ధాన్యం అదనపు ఉత్పత్తి
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరాసరి సంవత్సరానికి అదనంగా 14 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ధాన్యానికి తగిన గిట్టుబాటు ధర కూడా అందజేస్తున్నామని తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి గత తెలుగుదేశం భుత్వంలో పేరుకుపోయిన బకాయిలను కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో అన్నింటికి బకాయిలు పెట్టారని, చివరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారం డబ్బులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారని ఆరోపించారు. గత టీడీపీ హయాంలో కనీసం 2 లక్షల టన్నుల ధాన్యం కొనలేదని, ఎందుకంటే కరువు, చంద్రబాబు కవల పిల్లలులాంటివాళ్లని ఎద్దేవా చేశారు. రూ. 3వేల కోట్ల రూపాయిల ధరల స్థిరీకరణ నిధి ద్వారా.. రైతాంగానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో పంటలతో పాటు చిరు ధాన్యాలను కొనుగోలు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. పైగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో దళారుల పెత్తనం లేకుండా పూర్తిగా డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

ఉచిత విద్యుత్ పై రాజీపడే ప్రసక్తే లేదు
రైతులకు ఉచిత విద్యుత్‌ అందించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి కాకాణి తెలిపారు. మోటర్లకు మీటర్లు అంటూ కొందరు రాజకీయం చేస్తున్నారని, మీటర్లు బిగించకపోతే ఎంత విద్యుత్‌ ఎక్కడ ఖర్చవుతుందో, ఎవరు వాడుతున్నారో.. ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. లెక్కాపత్రం ఉంటేనే రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించగలమని చెప్పారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు ముందు తమ ప్రశ్నలకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంట్‌ తీగలు మీద బట్టలు ఆరేసుకోవాలంటూ కరపత్రాలు వేయించిన చంద్రబాబు నాయుడుకు దాని గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. అలాంటివాళ్లు ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. “రైతు శ్రేయస్సు కోరుకునే రైతు సంఘాలకు మేము స్పష్టత ఇచ్చాం. అర్థం చేసుకునే రైతు సంఘాలు అర్థం చేసుకున్నాయి. రాజకీయ ఉనికి కోసం పోరాడే రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే రైతు సంఘాలే వ్యతిరేకిస్తున్నాయి” అంటూ ఆయన వివరణ ఇచ్చారు.

కుటుంబ చరిత్ర తెలుసుకో.. లోకేశ్‌కు కాకాణి హితవు
చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “లోకేశ్ ఎవరు? ఎక్కడ గెలిచారు? ఏ ప్రజా ఉద్యమాల నుంచి వచ్చారు? వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తి నెల్లూరు వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేను ఫేక్ నా కొడుకులు అంటూ ఎలా మాట్లాడతారు?” అంటూ మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటో, క్యారెక్టర్ ఏమిటో అందరికీ తెలుసునన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పిక్ పాకెట్లు కొట్టుకునేవాడని ఆ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని విమర్శించారు. బాబు తండ్రి ఖర్జూరనాయుడు రాత్రి వేళల్లో రైతుల పొలాల్లో ఉంచిన వేరు శెనగ బస్తాలను దొంగలించేవాడని కాకాణి దుయ్యబట్టారు. చంద్రబాబు పుట్టుకే.. ఈ రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్‌లు అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని తూర్పారబట్టారు. లోకేశ్ నెత్తిన రూపాయి బిళ్ల పెడితే పావలా విలువ చేయడని, ఫ్రస్ట్రేషన్‌తో ఏదో మాట్లాడితే తన స్థాయిలో స్పందించడం అవమానకరంగా భావిస్తానని అన్నారు.

బహిరంగ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు, నోరు అదుపులో ఉండకపోవడం సిగ్గుచేటని, ఈసారైనా అధికారంలోకి వద్దామనుకుంటే అవకాశం లేకుండా పోతోందనే ఫ్రస్ట్రేషన్‌లో ఎక్కువైందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాకు వచ్చిన వాడు, వచ్చిన పని చూసుకోకుండా ముఖ్యమంత్రిపై నోరు పారేసుకున్నారని, ఏమాత్రం సంబంధం లేని జిల్లా మంత్రిగా ఉన్న తనను తూలనాడారని మంత్రి కాకాణి అన్నారు. చంద్రబాబు నాయుడు తన కొడుకును జాగ్రత‍్త చేసుకోవాల్సిన అవసరముందని, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన పారదర్శకంగా ఉన్నందున, అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలవుతోంది కాబట్టే లోకేష్‌ కావలి వచ్చి తిరిగి వెళ్లగలిగారని వ్యాఖ్యానించారు. ఆ పరిపాలన, ఆ రాజ్యాంగం అమలు కాకుంటే లోకేష్‌ అనేవాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement