Friday, November 22, 2024

Delhi | అవినీతి, వెన్నుపోట్లకు కేరాఫ్‌ చంద్రబాబు : విజయసాయి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అంతులేని అవినీతి, కుంభకోణాలు, వెన్నుపోట్లకు కేరాఫ్‌  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ చంద్రబాబు పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. అడ్డూఅదుపూ లేకుండా అవినీతి, స్కామ్‌లకు పాల్పడి చంద్రబాబు ఈరోజున 6 లక్షల కోట్లకు అధిపతి అయ్యారు.

తనపై తొమ్మిది క్రిమినల్‌ కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిడ్‌లో పేర్కొనడాన్నిబట్టి ఆయన క్రిమినల్‌ నేపధ్యాన్ని  అర్ధం చేసుకోవచ్చని విజయసాయి రెడ్డి అన్నారు. రాజకీయాలలో వెన్నుపోట్లు అనేవి చంద్రబాబుతోనే మొదలయ్యాయి. టీడీపితో పొత్తు పెట్టుకున్న బిజెపి, కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ మన ప్రజాస్వామ్యం దుస్థితి.

అలాంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పాల్పడిన కోట్లాది రూపాయల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవినీతి కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ సిఐడి ఆయను అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో ప్రాధమిక ఆధారాలు ఉన్నట్లుగా నిర్ధారించకున్న తర్వాతే కోర్టు చంద్రబాబుకు జుడిషియల్‌ కస్టడీ విధించింది. దీనిపై ఒకవైపు న్యాయప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు చంద్రబాబు అరెస్టుపై అఖిలపక్ష సమావేశంలో టిడిపి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో యాగీ చేయడానికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

- Advertisement -

పార్లమెంట్‌ 75 ఏళ్ళ ప్రస్థానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ టిడిపి పార్లమెంట్‌ సభ్యుల అనుచిత చర్యలకు సమాధానంగానే ఈరోజు చంద్రబాబు అవినీతి కుంభకోణాలు, నేర చరిత్ర గురించి సభలో ప్రస్తావించాల్సి వస్తోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్‌…

ఈ 75 ఏళ్ళ పార్లమెంటరీ ప్రస్థానం దేశ ప్రజల పోరాటాలు, విజయాలు, ఆకాంక్షలకు అద్దం పడుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే 1976లో అత్యంత వివాదాస్పదమైన 42వ రాజ్యాంగ సవరణతో కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంధకారంలోకి నెట్టిందని అన్నారు. ఇదో అంధకార సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోయింది. 

ఈ సవరణ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ  దేశంలో ఎమర్జెన్సీ విధించి దేశంలో కల్లోలం సృష్టించింది. తదనంతరం ఏర్పడ్డ కాంగ్రెసేతర ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణను రద్దు చేయకుంటే కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఎమర్జెన్సీని అలాగే కొనసాగించేందుకు చట్టాలను తీసుకువచ్చేదని అన్నారు. తదుపరి ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యల కారణంగానే ఈ రోజున మనం ఇక్కడ ఉండగలిగాం. ప్రజాస్వామ్యం మళ్ళీ పరిఢవిల్లిందని అన్నారు.

విభజనతో కాంగ్రెస్‌ అధికార దుర్వినియోగం…

2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపిఏ ప్రభుత్వం అంతులేని  అవినీతి, ఆశ్రితపక్షపాతం, విధాన నిర్ణయాల్లో నిస్సహాయత కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుబడిపోయిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ చేసిన తీరని అన్యాయం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా పార్లమెంట్‌ను దుర్వినియోగం చేస్తూ యుపిఏ ప్రభుత్వం ఎలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిందో వివరించాలి.

ఒకవైపు విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపిలు పెద్ద ఎత్తున సభలో నిరసనకు దిగినప్పటికీ పట్టించుకోకుండా అశాస్త్రీయంగా, నిర్హేతుకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విభజన బిల్లును ఆమోదించింది. ఇందుకోసం లోక్‌సభ తలుపులు మూసేశారు. సభా కార్యక్రమాల లైవ్‌ టెలికాస్ట్‌ను నిలిపివేశారు. విభజన బిల్లుపై ఓటింగ్‌ జరగాలని పట్టుబట్టిన ఆంధ్రప్రదేశ్‌ ఎంపిలను అన్యాయంగా సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వాలు రావచ్చు. పోవచ్చు.

అయితే విభజన బిల్లు ఆమోదం సందర్భంగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత బిజెపి ప్రభుత్వంపై ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 75 ఏళ్ళలో కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్ళు అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ కాకుండా మరే ఇతర పార్టీ అధికారంలో ఉన్నా భారత్‌ ఇప్పటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరేది. కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయం ఇదే. గత పదేళ్ళలో కాంగ్రెసేతర పార్టీ అధికారంలో ఉంటే దేశం ఏ విధంగా పురోగమిస్తోందో మన కళ్ళ ముందే చూడవచ్చని అన్నారు.

జనాభాకు తగ్గట్టుగా బిసిలకు రిజర్వేషన్లు…

దేశ 50 శాతంపైగా ఉన్న వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని శ్రీ విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా విద్య, ఉపాధిలో సమాన అవకాశాల కోసం, సామాజిక, ఆర్థిక పురోగతి కోసం బిసిలు అలమటిస్తున్నారని అన్నారు. దేశంలో బిసి జనాభాను కచ్చితంగా లెక్కించి వారి సామాజిక, ఆర్థిక వికాసం కోసం కుల గణన చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఇలాంటి కుల గణన స్వాతంత్రం రాక మునుపు ఎప్పుడో 1931లో నిర్వహించారని ఆ తర్వాత అలాంటి ప్రక్రియను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్‌…

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిన తొలిరోజు నుంచి చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం జరిగింది. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్ట సభలలో ప్రవేశించే అవకాశం లభించడం లేదు. దేశంలోని రాష్ట్ర అసెంబ్లీలలో 8 శాతం మాత్రమే మహిళలు ప్రాతినిధ్యం వహిస్తుంటే, లోక్‌ సభలో వారి ప్రాతినిధ్యం 15 శాతానికి పరిమితమైందని అన్నారు.

ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు వీలుగా బిల్లును ప్రవేశపెట్టాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశంలో 25 నుంచి 40 ఏళ్ళ వయస్సుగల యువ ఎంపీల ప్రాతినిధ్యం తొలి లోక్‌ సభలో 26 శాతం ఉంటే ప్రస్తుతం అది 12 శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. యువతకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా దేశంలో మార్పులకు నాంది పలకాలని ఆయన కోరారు.

ఇక పార్లమెంట్‌ పని విధానం గురించి ప్రస్తావిస్తూ 1950లో ఏడాదికి సగటున 120 రోజులు జరిగే పార్లమెంట్‌ సమావేశాలు గత పదేళ్ళ కాలంలో 70 రోజులకు కుదించుకుపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. 2022లో అమెరకన్‌ కాంగ్రెస్‌ 158 రోజులు, బ్రిటిష్‌ పార్లమెంట్‌ 137 రోజులు, కెనడా పార్లమెంట్‌ 96 రోజులపాటు సమావేశం అయితే మన పార్లమెంట్‌ కేవలం 70 రోజులు మాత్రమే సమావేశమైందని, పార్లమెంట్‌ సమావేశాల కాలాన్ని పొడిగించి అర్ధవంతమైన చర్చల ద్వారా శాసన నిర్మాణం సాగించి ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి దోహదం చేయాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement