పింక్ డైమండ్ మాయం లాంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్ళీ నియమించడం మంచి సాంప్రదాయం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో తమ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ప్రచారం చేయడానికి చంద్రబాబు తిరపతిలో పర్యటిస్తున్నారు. తొలుత రేణిగుంటకు చేరుకుని పలువురు నేతలతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు తిరుమలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడని, మనిషి మనిషేనని, దేవుడు దేవుడేనని చంద్రబాబు అన్నారు. మనుషులను దేవుడితో పోల్చడం తప్పన్నారు. పింక్ డైమండ్ మాయం లాంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్ళీ నియమించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. అలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి పేర్కొన్నారు. గతంలోనూ తిరుమలలో చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. 2003లో తనపై దాడి జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామే కాపాడారని తెలిపారు. వెంకటేశ్వరస్వామి కోలువై ఉన్న.. ఆయన పాదల చెంత తాను పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అని.. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశాలపై బాధ్యతగా ఉండాలని చంద్రబాబు చెప్పారు.
కాగా, ఇటీవలే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు.. జగన్‌ను విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు రమణదీక్షితులు వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. ఆయన పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు.