Friday, November 22, 2024

విజ‌న్ 2020 తోనే హైద‌రా’బాద్ షా’ – చంద్ర‌బాబు నాయుడు

ఉమ్మడి మెదక్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: విజన్‌ 2047 పేరుతో ఇండియన్స్‌ చరిత్ర సృష్టిద్దామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సీటీలో ”కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ” అనే విద్యా సంస్థ నిర్వహించిన గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్ర మానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత పట్టభద్రులైన విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు, పట్టాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, పబ్లిక్‌ పాలసీ గ్రాడ్యూయేషన్‌ సెర్మనీ అనే అంశంపై తాను తొలిసారి ప్రసంగిస్తున్నానని, పబ్లిక్‌ పాలసీ అనేది ఎంతో శక్తివంతమైనదని, అది భవిష్యత్‌ తరాలను మార్చుతుందన్నారు. కౌటిల్య అర్థశాస్త్ర పితామహు డని ఆయన పేరు ఈ సంస్థ పెట్టుకోవడం ఎంతో అభినందనీ యమన్నారు. ఆయన స్ఫూర్తితో విద్యాసంస్థలో చదువుతున్న ప్రతి ఒక్కరు ముందుకు సాగి లక్ష్యాలను అధిగమించాలని కోరారు.

ప్రస్తుతం భారత్‌ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను జరుపుకుందని ఈ 75 ఏళ్లలో ఎన్నో మైళ్లురాళ్లని అధిగమించామని, భవిష్యత్‌ అంటే 2047 నాటికి స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసు కుంటామని, దీనిని ఓ లక్ష్యంగా ఏర్పర్చుకుని 2047 పేరుతో ముందుకుసాగి ప్రపంచంలో ఆర్థిక వృద్ధిరేటులో మొదటి స్థానంలో నిలబడాలని కోరారు. ఇప్పుడున్న ఆర్థిక వృద్ధిరేటు లో మరో 15-16శాతం అదనంగా వృద్ధిరేటును కొనసాగిస్తే ప్రపంచంలో భారత్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని అధిగమించడం గొప్ప విషయమేమికాదన్నారు. కాని ఇందుకు సంకల్పం- లక్ష్యం ఎంతో అవసరమని సూచించారు. యువతే భారత్‌కు తరగని గని అని రానున్న రోజుల్లో భారత్‌ ఆర్థిక వృద్ధిరేటులో నంబర్‌ 1 స్థానాన్ని చేరుకుంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

విజన్‌ ఆంద్రప్రదేశ్‌ నా కల… కాని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు
”1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్‌కు వస్తే అప్పటి పరిస్థితులను ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే హైదరాబాద్‌ మహానగరం ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టా. ఫలితంగానే హైదరాబాద్‌లో నాడు సాఫ్ట్‌వేర్‌ రంగం గొప్పగా విరాజిల్లింది. విత్తనం వేస్తే కదా ఫలాలు వచ్చేవి. నా కృషి- నా విజన్‌ ఫలితంగానే నేడు హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది” మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. ”ఇదే విజన్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లో కృషి చేశా. కాని ప్రజలు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఫలితంగానే ఎన్నికల్లో ఓటమి పాలయ్యాను. గెలుపోటములు కామన్‌. దానిని స్పూర్తిగా తీసుకుని ముందుకుసాగాలి. అప్పుడే గమ్యమనే లక్ష్యాన్ని చేరుకుంటాం. నేటి యువత కూడా బంగారు లక్ష్యాల కోసం కలలు కనాలని వాటి కోసం ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని నిరంతర శ్రమ చేస్తే తప్పక విజయం చేరుకోలేం” అని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో గీతం చాన్సిలర్‌ వీరేంద్రసింగ్‌ చౌహాన్‌, గీతం ప్రెసిడెంట్‌ భరత్‌, గీతం డీన్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement