న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేక హత్య జరిగింది కాబట్టి ఆయన పాత్రపై దర్యాప్తు జరపాలంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. బాబు ఎన్టీఆర్‌తో పాటు తనను కూడా మోసం చేశారని కేఏ పాల్ ఆరోపించారు. రాజకీయం కోసం వివేకానందరెడ్డి హత్య కేసు జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ కోవర్ట్ అని కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్‌లో 3 లక్షల ఓట్లకు కేవలం 3 వేల ఓట్లు పడ్డాయన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని అందరికీ తెలుసునని, తెలంగాణలో బీజేపీ ప్రభావం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ తుడిచి పెట్టుకోవడం వల్లే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలు, కులాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న బీసీ అయిన తనకు 90 శాతం ప్రజల మద్ధతు ఉందని కేఏ పాల్ చెప్పారు.