జీవనోపాధి కోసం 33 ఏళ్ల క్రితమే వ్యాపారంలోకి వచ్చా
కేంద్ర కేబినెట్లో చేరే ఆలోచన అస్సలు లేదు
వికసిత భారత్ విజన్‌తోనే ముందుకు సాగుతున్నాం
సాంకేతికంగా బలమైన వృద్ధి సాధించిన భారత్
ఏ రాష్ట్రం నుంచి వచ్చిన భారతీయులంతా ఒక్కటే
దావోస్‌లో మనసు విప్ప మాట్లాడిన సీఎం చంద్రబాబు
దావోస్, ఆంధ్రప్రభ:
రాజకీయాల్లో వారసత్వం ఉండదని.. చుట్టూ ఉన్న పరిస్థితులతో అవకాశాలు వస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయాలు జీవనోపాధి కాదన్నారు. జీవనోపాధి కోసం తాను రాజకీయాలపై ఆధారపడలేదని, అందుకే 33ఏళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాలను ప్రారంభించానని చెప్పారు. బిజినెస్ అయితే లోకేష్‌కు తేలికైన పని అని, కానీ.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. లోకేశ్ రాజకీయాల్లోకి రావడంలో కుటుంబ వారసత్వం లేదని, ప్రజాసేవలో తృప్తిగా ఉన్నారని చెప్పారు.
మీడియా భేటీలో చిట్‌చాట్..
దావోస్ వేదికగా భారత్ తరఫున నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరైనా ఒకసారి మోసం చేసి అధికారంలోకి రావచ్చని.. ప్రతిసారీ అది సాధ్యం కాదన్నారు. వికసిత భారత్ విజన్‌తో వృద్ధి రేటు కోసం అంతా కలిసి పనిచేస్తే దేశాభివృద్ధి సాధ్యమేనని అన్నారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీపడినా ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానం అన్నారు.. .అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పని చేసే యువత ఉన్న దేశంగా భారత్‌కు స్వర్ణయుగం మొదలైందన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. తాను కేంద్ర మంత్రి వర్గంలో చేరబోవడం లేదని చెప్పారు.
ఏ రాష్ట్రం నుంచి వచ్చినా.. భారత్ అంతా ఒక్కటే
గతంలో దావోస్ కు ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారని.. చరిత్రలో మొదటిసారి భారత్ తరఫున అందరం కలిసి మాట్లాడుతున్నామని చెప్పారు. దేశంలో వివిధ పార్టీల నుంచి వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చినా.. దావోస్‌లో అందరం ఒక్కటేనన్నారు. దావోస్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీపడుతున్నా టీమ్ ఇండియాగా అందరిది ఒకే లక్ష్యం అన్నారు. భారత్ నుంచి దావోస్ సదస్సుకు హాజరు అవుతున్న వారిలో తానే సీనియర్‌ను అని చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. 1997 నుంచి దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు అవుతున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో భారత్‌కు చాలా తక్కువ గుర్తింపు ఉండేదనీ.. ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి భారత్ కు ఇంక్రిమెంటల్ గ్రోత్ రేట్ సానుకూలమైన అంశం అన్నారు. ప్రపంచంలో ఇప్పుడు ఇండియా అన్ స్టాపబుల్ అంటూ సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సాంకేతికంగా భారత్ అభివృద్ధి..
సుస్థిర వాతావరణం కోసం 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా భారత్ పని చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు అన్నారు. అందులో 165 గిగా వాట్లు విద్యుత్ ఏపీలోనే ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. దావోస్ లో భారత్ లోని వివిధ రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయని.. కానీ, అంతా ఐక్యంగా దేశం కోసం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రులు గా తాము వేర్వేరు పార్టీలకు చెందిన వారం అయినా ఐక్యంగా ఆలోచించేది దేశం కోసం ప్రజల కోసమని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, వ్యవసాయం, మానవాభివృద్ధి లో డీప్ టెక్ లాంటి సాంకేతికత రావాలని అన్నారు. పెట్టుబడులు ఆకర్షించడంలో, వృద్ధిరేటులో ఏపీ చాలా కృషి చేయాల్సి ఉందన్నారు. మరోవైపు ప్రపంచం నుంచి తీసుకెళ్ళడం కంటే దానికే సాంకేతికతను భారత్ అందిస్తోందని అన్నారు. వనరులు అవకాశాలను ప్రపంచానికి చూపుతున్నామని అన్నారు. 2047 కల్లా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని అన్నారు.
గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదకలో బెస్ట్..
ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు. దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈవోలు భారత సంతతికి చెందినవారే. సాంకేతికతను ముందుగా అందిపుచ్చుకున్న దేశంగా భారత్ ప్రయోజనాలు పొందుతోంది. వ్యాపార దక్షత, నైపుణ్యాలు ఉన్న యువత, జనాభా ఎక్కువగా ఉండటం భారత్ కు వరాలు. ప్రపంచం మొత్తానికి ఇండియా సేవలందిస్తోంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యంత ఆమోదయోగ్యులు భారతీయులే అన్నారు.. ఇక, దావోస్ పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు.. లోకేష్ ఇవాళ, రేపు కూడా దావోస్ లో ఉండనున్నారు.