విశాఖపట్నం, ఆంధ్రప్రభ భ్యూరో : దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (నిజరూపదర్శనం) ఈనెల 23న అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఏడాది పొడవున సుగంద భరిత చందనంలో కొలువుండే సింహాద్రినాధుడు ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్రగా, చందనోత్సవంగా పిలవడం జరుగుతుంది. ఉత్సవానికి సంబంధించి మంగళవారం ఆలయ ఇవో వి.త్రినాధరావు ఆధ్వర్యంలో టిక్కెట్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి.
రూ.300, రూ.1000 టిక్కెట్లను యూనియన్‌బ్యాంక్, స్టేట్‌బ్యాంక్‌ల ద్వారా విక్రయాలు జరపడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ భక్తులకు అందుబాటులో ఉంచారు. దీంతో తొలిరోజు పెద్ద ఎత్తున పలువురు భక్తులు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేశారు. వివిఐపి టిక్కెట్లు రూ.1500 విక్రయాలు త్వరలో జరపనున్నారు. మరో వైపు చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేశారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తున్నారు. మౌళిక సదుపాయాల కల్పనకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.