కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ఈ మహమ్మారి భారత్‌లో ఎంతటి కష్టాన్ని కలిగించిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో దేశం అతలాకుతలమైంది. ఈ క్రమంలోనే త్వరలో థర్డ్ వేవ్ ఉంటుందనే ఆందోళన అందరిలోనూ ఉంది. అయితే.. మూడో వేవ్ అవకాశాలు చాలా తక్కువేనని ఐసీఎంఆర్ సైంటిస్ట్ డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ వెల్లడించారు. అయితే పిల్లల్ని ఇప్పుడే స్కూళ్లకు పంపొద్దని సూచించారు.
ఒకవేళ దేశంలో మూడో వేవ్ వచ్చినా కూడా ఇంతకుముందులా అంత ప్రభావం ఉండకపోవచ్చని గంగాఖేడ్కర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెరవకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. తప్పని పరిస్థితుల్లో ఓపెన్ చేస్తే మాత్రం ఎక్కువమంది ఉండకుండా రోజుమార్చి రోజు విధానాలు పాటిస్తే మంచిదని సూచించారు. ఓ సర్వే ప్రకారం మూడింట రెండు వంతుల మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు తేలిందని.. అంతేకాకుండా వ్యాక్సిన్ వల్ల కరోనా నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందని వివరించారు. చిన్నారులకు కరోనా సోకినా.. వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. అయినా రిస్క్ తీసుకోవడం మంచిది కాదని.. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.