Saturday, November 23, 2024

Water Projects | శరవేగంగా చనాకా కోరాటా ప్రాజెక్టు పనులు.. డిసెంబర్‌ లో వెట్‌ రన్‌

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: శతాబ్దాల కాలం ఒడిలో మరాఠీలకు, తెలంగాణ కు ఉన్న స్నేహసంబంధాలు చరిత్రాత్మకంగానిలిచాయి. ఛత్రపతి శివాజీ గోల్కొండ కోటలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుని స్నేహ హస్తం చాటిన క్షణాలు చరిత్రలో చెదరని పేజీగా నిలిచినప్పటికీ కొంత సంధికాలం ఏర్పడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే మరాఠీల తో ఒప్పందం చేసుకుని నిర్మించిన కాళేశ్వంరం సేహాన్ని చిగురింప చేస్తే చనాకా- కొరాటా ప్రాజెక్టుతో రెండురాష్ట్రాల మధ్య స్నేహం మరింత బలపడిందని పలువురు భావిస్తున్నారు. తెలంగాణలోని కొరాట, మహారాష్ట్రలోని చనాకా గ్రామాల మధ్య అంతరాష్ట్ర ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి.

50 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ అనంతరం రెండురాష్ట్రాల ప్రజల కోరికలు సాకారం కానున్నాయి.పర్యావరణ అనుమతులు, నికర జాలాల కేటాయింపులు,సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ పొందిన ఈ ప్రాజెక్టు మొదటి పంపు వెట్‌ రన్‌ డిసెంబర్‌ లోగా నిర్వహించాలని నీటిపారుదల శాఖ వేగంగా పనులు నిర్వహిస్తోంది.ఆదిలాబాద్‌ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు వెట్‌ రన్‌ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ సమయంకోసం నీటిపారుదల శాఖ ప్రయత్నిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర పెన్‌ గంగా పై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్లితే….

గోదావరి నదికి ఉపనదీ పెన్‌ గంగాపై ఈ ప్రాజెక్టును నిర్మించాలని గత 50 ఏళ్ల క్రితం ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపి ఇరురాష్ట్రాలకు ఉపయోగ కరంగా ఉండే విధంగా ఉమ్మడి ప్రాజెక్టుగా డిజెన్‌ మార్చారు. అనంతరం మంత్రి హరీష్‌ రావు పనులు ప్రారంభించినప్పటికీ పర్యావరణ అనుమతులు, సీడబ్ల్యూసీ అనుమతులు ఆలస్యం అయ్యాయి. ఇటీవల తెలంగాణ నీటి పారుదల శాఖ సమగ్ర నివేదిక రూపొందించి సీడబ్ల్యూసీతో వరుస భేటీలు జరిపి ప్రాజెక్టుకు అనుమతులు తీసుకువచ్చారు.

- Advertisement -

అయితే ప్రాజెక్టుకు నిర్మాణ ప్రాంతానికి తిప్పేశ్వర వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది. అలాగే 213.18 ఎకరాల అటవీ భూమి ఉంది. దీంతో పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా అయ్యాయి. ఇటీవల వన్యప్రాణీ సంరక్షణసంస్థతో రెండురాష్ట్రాల ప్రతినిధులు సమావేశమై ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 2శాతం నిధులు వన్యప్రాణీ సంరక్షణ కోసం ఖర్చు చేయడంతో పాటుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అంగీకారం కుదిరింది. ఇదిఇలా ఉండగా 23నవంబర్‌ 2015న తెలంగాణ ప్రభుత్వం చనాకా కొరాటాబ్యారేజీ నిర్మాణానికి రూ. 368.80 కోట్ల పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ఈ నిధులతో పంపుహౌజ్‌, ప్రధాన కాల్వ, డ్రిస్టిబ్యూటరీల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడు పంపులను ఈ ప్రాజెక్టుకు బిగిస్తున్నారు. ప్రస్తుతం రెండురాష్ట్రాల్లో 360 కిలో మీటర్ల కాలువల పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయని ఇంజనీర్లు చెప్పారు.

అలాగే భూసేకరణ వేగవంతంగా జరుగుతుందనీ, రైతులు స్వచ్ఛందంగా ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇస్తున్నారని తెలిపారు. భూసేకరణ కోసం రెండురాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకనిధులు విడుదలచేశాయని సంబంధిత శాఖ అధికారులు చెప్పారు. రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పెన్‌ గంగ పై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును భవిష్యత్‌ లో మరింత విస్తృతం చేసే అవకాశాలున్నాయి. రభీ, కరీఫ్‌ సీజన్‌ లోకూడా నీటి నిలువలుఅధికంగా ఉండే ఈ ప్రాజెక్టు నిర్మాణాల పనులు పూర్తి అయితే రెండురాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో పారిశ్రామిక పంటలు పండించే అవకాశాలున్నాయని అధికారులు అంచనావేశారు. మహారాష్ట్ర,తెలంగాణపై తొలిసారిగా నిర్మిస్తున్న చనాకా-కొరాట ప్రాజెక్టు తో మరిన్ని ఉమ్మడిప్రాజెక్టులు నిర్మించే అవకాశాలున్నాని అధికారులు అంచనావేస్తున్నారు. పెన్‌ గంగాలో నీటి ప్రవాహం అన్నికాలాల్లో ఉండటంతో మరిన్ని రిజర్వాయర్లు నిర్మిస్తే రెండురాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందనే అంశాన్ని నీటిపారుదల శాఖ పరిశీలిస్తోంది.

మహారాష్ట్ర తెలంగాణ ఉమ్మడిగా నిర్మిస్తున్నచనాకా-కొరాట ప్రాజెక్టు నిర్మాణ పనులుదాదపుగా పూర్తి అయ్యాయి. మూడు పంపుల్లో మొదటి పంపు నిర్మాణపనులు పూర్తి అయ్యాయి. అయితే మిగతా రెండుపంపుల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ససుమారు రూ.100 కోట్లతో పంపుహౌజ్‌ ల నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు ప్రాజెక్టు పనులు 93 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ తనవాటాగా రూ. 409.44కోట్లు, మహారాష్ట్ర తనవాటాగారూ. 43.06 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్ర మరిన్ని నిధులు విడుదల చేయనుందని సమాచారం.ప్రాజెక్టు నిర్మాణంతో మహారాష్ట్రలొ 1.214హెక్టార్లు, తెలంగాణలో 5.566హెక్టార్లకు ప్రయోజనంచేకూరనుందని అధికారులు అంచనవేశారు. అయితే మరింత విస్తృత పరిచే అవకాశాలున్న చనాకా- కొరాటా ప్రాజెక్టు ప్రారంభంతో మరాఠీలతో తెలంగాణ స్నేహం మరింత చిగురిస్తుందని ఆశిద్దాం..

Advertisement

తాజా వార్తలు

Advertisement