తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం ఘనంగా జరిగింది. ముందుగా కంకణ బట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తులు , దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
లోకం క్షేమం
తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికి , భక్తులు సుఖశాంతులతో ఉండడానికి – చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. రాత్రి 7 నుండి 8 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయులు, వెంకటస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల విశేషాలు :
– ఆలయంలోని పోటులో శ్రీ వంశీస్వామి, శ్రీ భానుస్వామి ఆధ్వర్యంలో రోజుకు 15 నుండి 20 వేల మంది భక్తులకు పది రకాల ప్రసాదాలు తయారుచేసి పంపిణీ చేశారు. గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి పర్వదినాలలో 25 వేల నుండి 30 వేల మందికి ప్రసాదాలు అందించారు.
– ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో మీడియా సెంటర్ ఏర్పాటుచేసి బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందజేశారు. రోజుకు 100 మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
– బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వెయ్యి మందికి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో 1500 మందికి వైద్యసేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
– ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తొమ్మిది రోజులకు గాను 10 టన్నుల పుష్పాలు వినియోగించారు. 50 మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు. స్నపనతిరుమంజనం, వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు, చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు.
– అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ పర్యవేక్షణలో, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి రోజూ 75 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆలయం, పోటు, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు. గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి ప్రత్యేక దినాలలో 25 మంది అదనపు సిబ్బంది సేవలందించారు.