Tuesday, November 26, 2024

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో వీర వనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం. సాహ్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement