ఇద్దరు పిల్లలతోనే బతకలేకపోతున్నాం.. ముగ్గుర్ని కనాలా? అని చాలా మంది పెదవి విరుస్తున్నారు చైనా యువత. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశమేదంటే.. ఠక్కున వచ్చే సమాధానం చైనా. అయితే, అంత జనాభా ఉన్నా.. ముగ్గురు పిల్లల్ని కనొచ్చంటూ ఆ దేశం రెండు రోజుల క్రితమే ప్రకటన చేసింది. కారణం.. ఆ దేశంలో యువత తక్కువగా ఉండడం, వృద్ధులు పెరిగిపోతుండడమే. దాని వల్ల భవిష్యత్తులో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుందన్న భయంతో ముగ్గురు పిల్లల ప్రకటన చేసింది చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అయితే ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఇంకొకరిని కంటే మరింత భారమవుతుందని భయపడుతున్నారు. ఇటు పని వేళలు, ఒత్తిడితో కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పిల్లల్నే కనేందుకు చాలా మంది మహిళలు ఇష్టపడడం లేదని 22 ఏళ్ల పీజీ విద్యార్థిని యాన్ జియాఖీ చెప్పింది. ఇప్పటి పరిస్థితుల్లో చాలా మంది పెళ్లిళ్లు చేసుకోవాలనుకోవడం లేదని, ఉన్న డబ్బుతో ‘ఏక్ నిరంజన్’ జీవితాలకే మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఇప్పుడున్న వారికే నగరాలు సరిపోవడం లేదని, ఇంకా పిల్లల్ని కని ఎక్కడ పెట్టుకోవాలని యాంగ్ షెంగ్యీ అనే ఇద్దరు పిల్లల తండ్రి వాపోయాడు. ‘‘మా ఆదాయం అంతంత మాత్రమే. ఇద్దర్ని సాకడానికే ఆ మొత్తం చాలట్లేదు. మా నలుగురికి ఉంటున్న ఇల్లూ సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు పిల్లలంటే కష్టమే’’ అని గోడు వెళ్లబోసుకున్నాడు. పనివేళలు ఎక్కువగా ఉండడం, ఇళ్లు కొనాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా ధరలు భారీగా ఉండడం వంటి కారణాల వల్ల కొందరైతే పెళ్లిళ్లూ వద్దనుకుంటున్నారు.