Tuesday, January 7, 2025

TG | రైతు భ‌రోసాకు ఆంక్ష‌ల వ‌ల‌యం… కేటీఆర్

  • నిధులు ఎగ్గొట్టేందుకే నిబంధ‌న‌లు
  • ప్ర‌మాణ ప‌త్రం పేరుతో కాంగ్రెస్ కొత్త డ్రామాలు
  • భూమి ఉన్న ప్ర‌తి రైతుకు సాయం చేయాల్సిందే
  • బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్


హైద‌రాబాద్ : రైతు భ‌రోసా పొందాలంటే రైతులకు ఇవ్వాల్సిన ప్రమాణ పత్రాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొత్త డ్రామాలకు తెర‌లేపింద‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రైతు శాసించేలా కేసీఆర్ చూశారని.. నేడు రైతులు యోచించేలా కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు.


ఇప్పటికే రైతుబంధు ఒక సీజన్ ఎగ్గొట్టారని.. అది కూడా రైతులకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అసలు ప్రమాణ పత్రం ఇవ్వాల్సిందే రైతులు కాదని ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఏ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేశారో లిస్ట్ పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. అదేవిధంగా భూ యజమానులు, కౌలు రైతుల జాబితాలు కూడా పెట్టాలన్నారు. గ్రామాల వారీగా రైతు కూలీల లెక్కలు పెట్టాలని సవాల్ విసిరారు.

‘రైతు‌బంధు’ పథకాన్ని బొంద పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకే ‘రైతుబంధు’ ను చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.22వేల కోట్ల రుణమాఫీ నిధులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు ‘రైతు భరోసా’కు మళ్లీ కొత్తగా దరఖాస్తులు ఎందుకు ఇవ్వాలో చెప్పాలన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఎన్నో కథలు చెప్పిందని.. రేవంత్ సర్కార్ అర పైసా కూడా రైతులకు ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేకమైన విధానాలు అమలు చేస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నారన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రైతులపై పెట్టుబడిని పెంచేందుకు కేసీఆర్ రైతులకు పలు ఆర్థిక సాయం పథకాలను ప్రవేశపెట్టారన్నారు.

రైతు బంధు పథకం రైతు సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకమని, కేసీఆర్ 11సార్లు రైతు బంధు అందించార‌ని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ, వారు ఇప్పటి వరకు రైతు సాయం అందలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న పథకాలు ముఖ్యంగా రైతు బంధు, మానసిక స్థితిని మార్చి రైతులకు నూతన ఆశలు క‌లిగించాయ‌న్నారు. ఇప్ప‌టికైనా భూమి ఉన్న ప్ర‌తి రైతుకు ఎటువంటి అంక్ష‌లు లేకుండా రైతు భ‌రోసా నిధులు అందించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement