న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జీవనశైలి వ్యాధులబారిన పడకుండా ఉండడంతో పాటు అధిక పోషక విలువలున్న ఆహార పదార్థాల వినియోగం పెంచడం కోసం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ క్యాంటీన్లలో తృణధాన్యాలతో తయారుచేసిన ఆహార ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలు, సమావేశాల్లో సరఫరా చేసే ఆహార పదార్థాల్లోనూ మిల్లెట్ స్నాక్స్ వినియోగించాలని పేర్కొంది. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం (ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్)గా గుర్తించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తృణధాన్యాల సేకరణతో పాటు వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
తృణధాన్యాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రాగి బిస్కట్లు, రాగితో తయారు చేసిన కుకీస్, రాగి లడ్డూ, మిల్లెట్ దోశ, మిల్లెట్ మిక్స్ వడ, మిల్లెట్ మిక్స్ పూరి వంటి స్థానికంగా అందుబాటులో ఉన్న తృణధాన్యాల ఆహార పదార్థాలను క్యాంటీన్లలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. తృణధాన్యాల్లో పలు రకాల పౌష్టిక విలువలతో పాటు జీర్ణక్రియలో అవసరమైన పీచుపదార్థాలను కూడా కలిగి ఉంటాయని, పోషకాహార లోపం వంటి సమస్యలను అధిగమించడానికి తృణధాన్యాల వినియోగం ఉత్తమ మార్గమని పేర్కొంది.