Wednesday, November 20, 2024

భారత వేరియంట్ అనే పేరే కనిపించకూడదు: కేంద్రం

కరోనా సంక్షోభం మహోగ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల తరచుగా భారత వేరియంట్ అంటూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ వేరియంట్ ప్రమాదకరమైనది కావడంతో దీనిపై చర్చ కూడా అధికస్థాయిలోనే జరుగుతోంది. అయితే, భారత వేరియంట్ అనే పేరుతో ఇది విపరీతమైన ప్రాచుర్యంలోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తుండడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై ఏ సోషల్ మీడియా వేదికలోనూ భారత వేరియంట్ అనే పదం కనిపించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. భారత వేరియంట్ అనే పదంతో కూడిన కంటెంట్ ఏ మాధ్యమంలో ఉన్నా తొలగించాల్సిందేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారత వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను భారత వేరియంట్ అని పేర్కొనడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617 వేరియంట్ ను భారత వేరియంట్ గా ఎక్కడా పేర్కొనలేదని కేంద్రం వివరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం ఇదే విషయాన్ని గతంలో విడమర్చిందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement