ఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయంపై దేశ రాజధాని నడిబొడ్డున నిరసన చేపడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. సోమవారం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బుధవారం తాను జంతర్ మంతర్ వద్ద చేపడుతున్న ధర్నాకి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌తో పాటు పవన్ కళ్యాణ్, ఇతర పార్టీల నేతలు ధర్నాకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని పాల్ ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి సిగ్గు లేని కామెంట్స్ చేయడమేంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడని అభిప్రాయపడ్డారు. అందుకే జేడీ లక్ష్మీనారాయణ వంటి నాయకులు జనసేనను వదిలి వెళ్లిపోయారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం హైదరాబాదులోనే గ్లోబల్ సమ్మిట్ పెడతానని కేఏ పాల్ వివరించారు. రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడనని, తెలుగు ప్రజల బాగు కోసం ఎంతవరకైనా వెళ్తానని స్పష్టం చేశారు. భారతదేశం త్వరలో వెనిజులా, శ్రీలంక కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఆగస్టు 15 వరకు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేఏ పాల్ హెచ్చరించారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.