Tuesday, November 19, 2024

India | మోదీకి అదానిపై ఉన్న ప్రేమ.. దేశ ప్రజలపై ఉంటే బాగుండేది: బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్

దేశంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారబోతోందని, కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, మోదీ తీసుకుంటున్న చర్యలే దీనికి కారణమన్నారు బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​. ఇవ్వాల నాందేడ్​లో జరిగిన భారీ బహిరంగసభలో ప్రసంగించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అదానిపై మోదీకి అపారమైన ప్రేమ ఉందని, ఆయన కంపెనీ నుంచి బొగ్గు కొనుగోలు చేయాలని రాష్ట్రాలను ఒత్తిడి చేస్తున్నారని, అదే ప్రేమ దేశ ప్రజలపై ఉంటే బాగుండేదన్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. బొగ్గు దిగుమతిపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అదానీ గ్రూప్ ‘స్కామ్’పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను టచ్​ చేశారు. అదానీ గ్రూప్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పెట్టుబడులు బహిర్గతం అయ్యాయని, దీంతో కేంద్రం తప్పుడు ప్రకటన చేయాలని ఎల్​ఐసీపై ఒత్తిడి చేస్తోందన్నారు. ఈ సమస్యలో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రమేయం ఉందని, అందుకని యావత్​ దేశం మొత్తం ఆందోళన చెందుతోందన్నారు.

- Advertisement -

అదానీ గ్రూప్ మాత్రమే సరఫరా చేసే బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను బలవంతం చేస్తోందని ఆరోపించారు. బొగ్గు దిగుమతి దేశాన్ని మోసం చేయడం లాంటిదని, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మారుస్తామని చెప్పారు. ‘‘అదానీ గ్రూప్ ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడింది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చించాలని ప్రధానికి నా విన్నపం. దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. అతను (అదానీ) మీ స్నేహితుడని అందరికీ తెలుసు. కేవలం రెండు సంవత్సరాల్లోనే అతను ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు. మీకు నిజాయితీ ఉంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయండి. అది నా డిమాండ్‌’’ అని కేసీఆర్​ ప్రధాని మోదీని కోరారు.

ఇక.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు  అదానీ గ్రూపులో రూ. 80,000 కోట్లు ఉందని బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ పేర్కొన్నారు. కానీ, దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు కేంద్రం ఎల్‌ఐసీకి ప్రమాదం లేదని తప్పుడు ప్రకటన చేయాలని ఒత్తిడి తెస్తోందని చెప్పుకొచ్చారు. LIC ప్రపంచంలోనే అతిపెద్ద, మెరుగైన పనితీరు కనబరుస్తున్న బీమా కంపెనీ అయితే ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోంది? అని కేసీఆర్​ ప్రశ్నించారు.

బొగ్గు దిగుమతి గురించి మాట్లాడుతూ దేశంలో రాబోయే 120 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అయితే మన బొగ్గును పక్కనపెట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బలవంతం చేస్తోందన్నారు. అయితే.. ఈ బొగ్గును అదానీ గ్రూప్ మాత్రమే సరఫరా చేస్తుందన్నారు. కేంద్రానికి అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై ఉండాలన్నారు. US-ఆధారిత సంస్థ, షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కొన్ని కీలక వివరాలను బయటపెట్టిందని, మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు వంటి వాటితో అదానీ గ్రూప్ పోరాడుతోందన్నారు. హిండెన్​బర్గ్​ రిపోర్టు బయటపడడంతో అదానీ కంపెనీల షేర్ల ధరలు బాగా పతనానికి దారితీసినట్టు చెప్పారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement