Saturday, November 23, 2024

లాక్ డౌన్ ఒక్కటే మార్గం… మరోదారి లేదా?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన మాములుగా లేదు. వేలు దాటి లక్షల్లో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వారాంతపు లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి.  దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ కేంద్రం దేశవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. మే 2 తరువాత ఏ రోజైనా లాక్ డౌన్ ప్రకటన రావొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కరోనాపై గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్రమోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రా ముఖ్యమంత్రులు, ఫార్మ కంపెనీలతో పలు దఫాలుగా వర్చువల్ గా సమావేశం నిర్వహించి పరిస్థితిపై అంచనా వేశారు. దేశ ఆర్థిక పరిస్థిని దృష్టిలో పెట్టుకుని ఇప్పట్లో లాక్ డౌన్ విధించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ చిరవి అస్త్రం మాత్రమేనని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. దేశంలో సెకండ్ వేవ్ చేయి దాటిపోయింది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అదే స్థాయిలో వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బీద, ధనిక, సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ మొదలు పలువురు రాజకీయ నాయకులు కూడా కోవిడ్‌ బారిన పడ్డారు. తెలుగురాష్ట్రాలు సహా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాకట, గుజరాత్‌, తమిళనాడు,  రాజస్థాన్, బీహార్, కేరళతోపాటు అనే రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులను నియంత్రించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వారాంతపు లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఇంకా కేసులు తగ్గక పోవడంతో పలు రాష్ట్రాలు నిబంధనల అమలు సమయాన్ని పొడిగించే యోచనగా అడుగులు వేస్తున్నాయి. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 63 శాతం కేసులు ఉండటం గమనార్హం. ఇప్పటివరకూ పాక్షిక లాక్ డౌన్ లను అమలు చేస్తూ వస్తున్న ఉద్ధవ్ సర్కారు, పూర్తి లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.

దేశ రాజధాని ఢిల్లీలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న కేజ్రీవాల్ సర్కారు… కేసుల సంఖ్య ఏ మాత్రమూ తగ్గకపోవడంతో నిబంధనల అమలును మరో వారం పాటు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. ఈ కాలంలో కరోనా కేసులు తగ్గకపోగా… మరింత పెరిగాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ మరోవారం పాటు పొడిగించాలని సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు. మార్కెట్లను మరోవారం పాటు మూసేసేందుకు వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. మే 2 వరకు వాణిజ్య సముదాయాలు తెరవకూడదని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్టు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఢిల్లీ విభాగం తెలిపింది. 

ఇక ఢిల్లీ ప్రజలు కూడా ఇంకో వారం లాక్ డౌన్ కంటిన్యూ చేయాలని అభిప్రాయపడుతున్నారు. లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పబ్లిక్ సర్వే చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 48శాతం మంది రెండు వారాలైనా లాక్ డౌన్ ఎక్స్ టెండ్ చేయాలని అభిప్రాయపడ్డారు. 62వాతం మంది కనీసం మరోవారం పాటైనా లాక్ డౌన్ పొడిగించాలన్నారు. ఈ సర్వేలోని ఢిల్లీలోని 11 జిల్లాల్లో 8వేల మంది అభిప్రాయాలను సేకరించారు. ప్రజల ప్రాణాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పేలా లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.


తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నెల 30తో నైట్ కర్ఫ్యూ ముగియాల్సి వుండగా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిబంధనల అమలును పొడిగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 8 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యలో లాక్ డౌన్ విధించడం లేదా నైట్ కర్ఫ్యూను కొనసాగించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత అధికారులతో కీలక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

- Advertisement -

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య ఇప్పటికే పది వేల మార్క్ ను దాటింది. కరోనా కటడ్డిలో భాగంగా నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. అంతేకాదు ప్రజలు బయటకు వస్తే మాస్క్ తప్పని సరి చేసింది. మాస్క్ లేని వారికి జరిమానాలు కూడా విధిస్తోంది. అయితే నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని వాదనలు వినిపిస్తున్నాయి. క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తిని నిలువ‌రించ‌డానికి కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన జ‌మ్ముక‌శ్మీర్‌లో క‌ర్ఫ్యూ విధించారు. క‌రోనా క‌ట్ట‌డికి 34 గంట‌ల క‌ర్ఫ్యూని అధికారులు అమ‌లు చేస్తున్నారు. శ‌నివారం రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన క‌ర్ఫ్యూ సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. దీంతో అన్నిర‌కాల మార్కెట్లు, వాణిజ్య స‌ముదాయాలు మూత‌ప‌డ్డాయి. కేవ‌లం అత్య‌వ‌స‌ర‌మైన సేవ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈనెల 8 నుంచి రాత్రి కర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు అమ‌ల్లో ఉంది.

సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ మరింత బలంగా మారుతుందంటున్న వైద్య నిఫుణుల మాటలూ లాక్ డౌన్ విధింపు రూమర్లకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసింది. బ్రిట‌న్, ద‌క్ష‌ణాఫ్రికా లాంటి దేశాల్లో ఉన్న వేరియంట్లను మన దేశంలోనూ ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలో దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ ఉందని నిర్ధారణ చేసినట్టు సమాచారం. చాలా వేగంగా వ్యాప్తి చెందే దక్షిణాఫ్రికా రకం వైరస్‌ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా కట్టడికి రాష్ట్రాలు చర్యలు చేపట్టినా.. మహమ్మారి ఉద్ధృతి ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే స్వచ్ఛందంగా గ్రామాల్లో ప్రజలు లాక్ డౌన్ విధించుకుంటున్నారు. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే దేశంలోని పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్‌ డౌన్‌ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మే, జూన్ నెలలో కరోనా మరింత వేగంతో వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ వైపే కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నెలల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున.. సుమారు 80 కోట్ల మంది పేదలకు బియ్యం, గోధులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సమకూర్చనున్నట్టు కేంద్రం ప్రకటించడం కూడా దేశ వ్యాప్త లాక్‌ డౌన్‌ కోసమేనని ప్రచారం జోరుగా సాగుతోంది. మరి కేంద్రం నిర్ణయం తెలియాలంటే మే 2 వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement