హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉపాధి హామీ పథకం నిధుల విడుదలలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జాతీయ ఉపాధి హామీ పథకం కౌన్సిల్ ఆరోపించింది. సోమవారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షతన జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనిలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, పలు శాఖల ఉన్నతాధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనుల నిర్వహణ, పురోగతి సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని, మున్సిపాలిటీలలో ఉపాధి హామీ పథకం అమలుకు అకాశం ఇవ్వాలని తీర్మానం చేశారు. గత ట్రాక్ రికార్డు ఆధారంగా ఇప్పుడు జరుగుతున్న పనులను చూసి రాష్ట్రానికి కనీసం 16 కోట్ల పనిదినాలను ఆమోదించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా చెల్లింపులు ఇవ్వాలని, పని జరిగే ప్రాంతాల్లో ఫోటోలు తీయడం, పంపడం వంటి ఇబ్బందికర చర్యలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.
ఇప్పటికే బకాయిలుగా ఉన్న లేబర్ పేమెంట్ 97 కోట్ల 35 లక్షల రూపాయలను వెంటనే చెల్లించాలని కేంద్రాన్ని ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం కోరింది. కౌన్సిల్ సమావేశం అనంతరం మీడియాతో మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లరెడ్డి, సత్యవతి రాథోడ్ కలిసి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణలో అడిగిన వారందరికీ జాబ్ కార్డులు అందజేస్తున్నామని, కూలీలు కూడా ఉపాధి పనుల కోసం డిమాండ్ చేస్తున్నారని వారు వెల్లడించారు. ప్రజలకు అవసరమైన పనులకు మాత్రమే ఉపాధి హామీ నిధులను విడుదల చేస్తున్నమని అన్నారు. నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కల్లాలు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు వంటి పనులకు ఉపాధి హామీ నిధులను వాడుతున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.
2021-22 సంవత్సరంలో 15 కోట్ల పనిదినాలకు గాను నాలుగు వేల 395 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. ఈసారి బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం రూ.25 వేల కోట్లు కోత పెట్టిందని వారు తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చే 15వ ఆర్ధిక సంఘం నిధులు కూడా రూ. 1830 కోట్ల నుంచి రూ.1380 కోట్లకు తగ్గించారని వారు వెల్లడించారు. కేంద్రం రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలకు నిలిపివేయడమే కాకుండా తెలంగాణను బదనామ్ చేస్తున్నారని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ వంటి నేతలు మాట్లాడుతున్నరని మంత్రులు ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..