Friday, November 22, 2024

Big Story: ప్రతి జిల్లాలో సెంట్రల్‌ నర్సరీ.. అన్ని రహదార్లలో అవెన్యూ ప్లాంటేషన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రతి జిల్లాకు ఒక సెంట్రల్‌ నర్సరీని అటవీశాఖ ఏర్పాటు చేయనుంది. ఆ నర్సరీల్లో కనీసం ఐదు లక్షలకు తగ్గకుండా మొక్కలను పెంచుకునేలా చర్యలు తీసుకోనున్నారు. దశలవారీగా సెంట్రల్‌ నర్సరీల సంఖ్యను పెంచుకోవాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం అరణ్యభవన్‌ నుంచి అన్ని జిల్లాల అటవీశాఖ అధికారులతో అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం. డోబ్రియల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. త్వరలో ముఖ్యముంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హరితహారం నిర్వహణ, అటవీ పునరుద్ధరణ, అర్బన్‌ ఫారెస్టు పార్కులు, అటవీ అనుమతుల ప్రక్రియపై అధికారులతో ఆయన సమీక్షించారు. తెలంగాణకు హరితహారంలో భాగం రాష్ట్ర వ్యాప్తంగా మరింత చిక్కటి పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రహదారి వనాలు (అవెన్యూ ప్లాంటేషన్‌) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులకు విస్తరించాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన చోట్ల ఎక్కడైనా చెట్లు చనిపోతే గ్యాప్‌ ప్లాంటేషన్‌ను పొడవైన మొక్కలతో పూర్తి చేయాలన్నారు.

రాజీవ్‌ రహదారి వెంబడి పచ్చదనం మరింత పెంచేలా ఆయా జిల్లాల పరిధిలోకి వచ్చే అధికారులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అర్బన్‌ పారెస్టు పార్కుల నిర్వహణపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో అర్బన్‌ ఫారెస్టు పార్కులు పర్యావరణహితంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అనంతరం అటవీ పునరుద్ధరణ పనులు, పురోగతిపై పీసీసీఎఫ్‌ (కంపా) లోకేష్‌ జైస్వాల్‌ సమీక్షించారు. అడవుల ప్రాధాన్యత, పునరుద్ధరణ ద్వారా సాధించిన ప్రగతిని సీఎంతో పాటు ప్రముఖుల పర్యటనల సందర్భంగా ఫోటోలు, వీడియోలతో ప్రదర్శించాలని అన్ని జిల్లాల అటవీ అధికారులకు ఆయన సూచించారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం అటవీ భూముల మళ్ళింపు అవసరమైన చోట్ల అనుమతుల ప్రక్రియ వేగంగా జరిగేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పీసీసీఎఫ్‌ (ప్రొడక్షన్‌ ) ఎం. సీ . పర్గెయిన్‌ కోరారు. మళ్ళింపులో భాగంగా రెవెన్యూ నుంచి తీసుకున్న భూములను నోటిఫై చేయడంతో పాటు ప్రత్యామ్నాయ అటవీకరణ సత్వరం చేపట్టాలని తెలిపారు. ఈ సమీక్షలో అన్ని జిల్లాల అటవీ సర్కిళ్ళ చీఫ్‌ కన్జర్వేటర్లు, జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement