Saturday, November 23, 2024

పలువురు కేంద్రమంత్రుల రాజీనామా

బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులు రాజీనామా చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అనారోగ్య కారణాలతో మంత్రి పదవి నుంచి తప్పుకోగా.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సంతోష్ గంగ్వార్ కూడా తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపారు. మరోవైపు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా మరికొందరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డికి మోదీ టీంలో ప్రమోషన్ రానున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం మోదీ కేబినెట్‌లో క‌నీసం 22 మంది కొత్త మంత్ర‌ులు ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే అప్పుడు క్యాబినెట్ సామ‌ర్థ్యం 75కే చేరుకుంటుంది. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వి ద‌క్కిన నేత‌లంతా మోదీ నివాసానికి చేరుకున్నారు.

2014లో తొలిసారి 45 మందితో మోదీ త‌న కేబినెట్‌ను ప్ర‌క‌టించారు. మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌.. మ్యాగ్జిమ‌మ్ గ‌వ‌ర్నెన్స్ అన్న నినాదాన్ని ఇచ్చారాయ‌న‌. కానీ మూడేళ్ల త‌ర్వాత త‌న లీగ్ మెంబ‌ర్స్‌ను పెంచేశారు. మంత్రుల సంఖ్య‌ను 76కు చేశారు ప్ర‌ధాని మోదీ. ఇక 2019లో రెండ‌వ‌సారి ఎన్నికైన త‌ర్వాత‌.. తొలుత 58 మందితో క్యాబినెట్‌ను మోదీ ప్ర‌క‌టించారు. అయితే వివిధ కార‌ణాల చేత ఆ సంఖ్య ఇప్పుడు 53కు చేరుకున్న‌ది. ఒక‌వేళ మోదీ క‌నుక 23 మంది కన్నా ఎక్కువ సంఖ్య‌లో కొత్త మంత్రుల‌ను చేర్చుకుంటే.. అప్పుడు ఆయ‌న రికార్డు బ‌ద్ద‌లు కొట్ట‌డం అనివార్యం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement