Saturday, November 23, 2024

ట్విట్టర్, కేంద్రం మధ్య ముదురుతున్న వార్

ట్విటర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఐటీ నిబంధనలు అమలు చేయకపోవడంతో ట్విటర్‌ను ఇకపై సామాజిక మాధ్యమంగా కాకుండా ఓ పబ్లిషర్‌లా కేంద్ర ప్రభుత్వం చూడనుంది. అంటే యూజర్లు చేసే ప్రతి ట్వీట్‌కు ట్విటర్ బాధ్యత వహించాలి. ఎవరైనా తప్పుదోవ పట్టించే, అభ్యంతరకర పోస్టులు పెడితే సదరు యూజర్‌తో పాటు ట్విటర్‌పైనా కేసులు నమోదు చేయవచ్చు. భారత్‌లోని సోషల్ మీడియాలలో ట్విటర్ మాత్రమే కేంద్రం నిబంధనలు పాటించడం లేదు.

మరోవైపు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్‌కు అనేక ప్రశ్నలు సంధించారు. ఒకేసారి వరుస ట్వీట్లు చేసిన ఆయన ట్విటర్‌ను టార్గెట్ చేశారు. ఆయన ఏమన్నారంటే..

“మే 26న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్ అమలు చేయడంలో ట్విటర్ విఫలమైంది. మా నిబంధనలు అనుసరించడానికి ట్విటర్‌కు చాలా అవకాశాలు ఇచ్చాం. కానీ అది కావాలనే వాటిని పాటించకూడదనే మార్గం ఎంచుకుంది”

విశాల భారతదేశంలాగే, దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సోషల్ మీడియా వల్ల, ముఖ్యంగా నకిలీ వార్తల ద్వారా వ్యాపించే చిన్న నిప్పురవ్వ కూడా పెనుమంటగా మారవచ్చు. వాటిని అడ్డుకోవడం కోసమే మేం కొత్త నిబంధనలు రూపొందించాం”

“భావ ప్రకటనా స్వేచ్ఛ జెండాను మోస్తున్నట్టు ట్విటర్ తనను తాను వర్ణించుకుంటోంది. కానీ గైడ్‌లైన్స్ విషయానికి వస్తే మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. వీటితోపాటూ, ట్విటర్ భారత చట్టాలను పాటించడానికి నిరాకరిస్తోంది. యూజర్ల ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేస్తోంది. తన సౌకర్యం, ఇష్టాయిష్టాలను బట్టి వ్యవహరిస్తోంది”

- Advertisement -

“నకిలీ వార్తలను అడ్డుకోవడంలో ట్విటర్ ఎలా ఏకపక్షంగా వ్యవహరించిందో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటనలు నిదర్శనం. వాస్తవాలను ధ్రువీకరించుకోవడం గురించి ట్విటర్ చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, ఉత్తర్‌ప్రదేశ్ సహా చాలా కేసుల్లో దాని నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది”

“ఫార్మా అయినా, ఐటీ సెక్టార్ అయినా భారత కంపెనీలు అమెరికా, లేదా వేరే ఏ దేశానికైనా వ్యాపారం చేయడానికి వెళ్లినపుడు అక్కడి నియమ నిబంధనలు పాటిస్తాయి. భారత్‌లో హింసకు గురైనవారికి ఒక గళం ఇవ్వడానికి కేంద్రం నిబంధనలు రూపొందించినపుడు దానిని అనుసరించడానికి ట్విటర్ అయిష్టత చూపిస్తోంది”

“చట్ట నిబంధనలు భారత సమాజాలకు ఆధారం. భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి భారత్ రాజ్యాంగబద్ధమైన హామీని ఇస్తుంది. జీ-7లో కూడా అదే పునరుద్ఘాటించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో భారత చట్టాలను అనుసరించకుండా ఏ విదేశీ కంపెనీ అయినా తప్పించుకోలేదు” అని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement