Friday, November 22, 2024

Central Minister: ప‌డ‌వ‌లో చిక్కుకున్న కేంద్ర మంత్రి రూపాల… త‌ప్పిన ప్ర‌మాదం..

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల మంత్రి పురుషోత్తం రూపాలకు పెద్ద ప్రమాదం త‌ప్పింది. కేంద్ర మంత్రి ఒడిశాలోని చిలికా సరస్సులో ప్రయాణిస్తున్న పడవ రెండు గంటల పాటు చిక్కుకుపోయింది.

వెంటనే స్పందించిన సిబ్బంది చిలికా సరస్సులోకి మరో పడవను పంపి.. మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మత్స్యకారులు వేసిన వలలో పడవ ఇరుక్కుపోయి ఉంటుందని ముందుగా అనుమానించగా.. తాము దారి తప్పిపోయామని మంత్రి పురుషోత్తం స్పష్టం చేశారు.

11వ దశ ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులతో సమావేశం అయ్యేందుకు ఒడిశా పర్యటనకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వచ్చారు. ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు పడవలో కేంద్ర మంత్రి బయల్దేరారు. మంత్రితో పాటు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, ఇతర స్థానిక పార్టీ నాయకులు కూడా పడవలో ఉన్నారు. చీకటి పడడంతో పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో వెళ్ళాడు. దీంతో వెళ్లాల్సిన దారి తప్పిపో​యారు. చిలికా సరస్సు మధ్యలో నలబానా పక్షుల అభయారణ్యం సమీపంలో పడవ సుమారు రెండు గంటలపాటు చిక్కుకుపోయింది. మరో పడవలో మంత్రి సురక్షితంగా ఒడ్డుకు వచ్చారు.
చీకటి పడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త మార్గంలో వెళ్లాడు. మేము దారి తప్పిపోయాము. సతపద చేరుకోవడానికి మాకు మరో రెండు గంటలు పట్టింది’ అని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల విలేకరులతో చెప్పారు. పూరీ జిల్లాలోని కృష్ణప్రసాద్ ఏరియా సమీపంలో జరిగే కార్యక్రమానికి మంత్రి హాజరు కావాల్సి ఉండగా.. ఈ ఘటన కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. కేంద్ర మంత్రి రాత్రి 10.30 గంటలకు పూరీకి చేరుకున్నారని ఓ అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement