అమరావతి, ఆంధ్రప్రభ : కేంద్ర జలశక్తి శాఖ దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ జల్ సే సురక్ష కార్యక్రమం అమలులో ఏపీ రెండవ స్థానంలో నిలిచింది. 900 మార్కులకు గాను 598 మార్కులతో తమిళనాడు మొదటి స్థానం దక్కించుకోగా 568 మార్కులతో ఏపీ రెండోస్థానంలో నిలిచింది. గత ఏడాది మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించిన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న రాష్ట్రాల్ర జాబితాను ఈనెల 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల ముందు కేంద్ర జలశక్తి విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేంద్ర జలశక్తి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సురక్షిత నీటి వాడకంపై ప్రచారం నిర్వహిస్తోంది. తాగునీటి పథకాల నిర్వహణ, నీటి నాణ్యతా పరీక్షలు, సురక్షిత నీటి సరఫరా, ఫ్లోరైడ్, నైట్రేట్ రసాయనాలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ-కోలి తరహా బ్యాక్టీరియాలను గుర్తించిన ప్రాంతాల్లో వాటి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు.. తదితర కొలమానాల ఆధారంగా కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట్రాల్రకు మార్కులు కేటాయించింది.
ఏపీలో 18,393 గ్రామాలకు గాను 17,772 గ్రామాల్లోని తాగునీటి వనరుల వద్దనే నీటి పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచినట్టు కేంద్ర జలశక్తి ప్రకటించింది. 1.64 లక్షల పరీక్షలు నిర్వహించి 20,193 చోట్ల కాలుష్య కారకాలను గుర్తించి అవసరమైన ప్రత్యామ్నాయ తాగునీటి వనరులను ఒనగూర్చి ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసినట్టు వెల్లడించింది.