బీజేపీలో చేరకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీఎంసి నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ఆరోపించారు. పురులియా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఐటీ శాఖతో పాటు ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ తదితర దర్యాప్తు సంస్థలు బీజేపీకి చెందిన విభాగాలుగా పనిచేస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను హింసించేందుకు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా దాడులు, ఇళ్లలోకి చొరబడేందుకు ఈ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని మమత ఆరోపించారు.
రాత్రిపూట ఇంట్లోవారంతా నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా చొరబడితే మహిళలు ఏం చేస్తారు ? అని ఆమె ప్రశ్నించారు. దీనికి ఉదాహరణగా భూపతినగర్‌లో శనివారం జరిగిన సంఘటన ప్రస్తావించారు. పేలుడు సంఘటన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడానికి ఎన్‌ఐఎ వెళ్లినప్పుడు అక్కడి జనం దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి కవ్వింపులకు ప్రజలు లొంగవద్దని సూచించారు. శ్రీరామనవమిని దృష్టిలో పెట్టుకుని మతపరమైన కోర్కెలను బీజేపీ ప్రేరేపిస్తోందని ఆరోపించారు.
బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం పశ్చిమబెంగాల్ లోని గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలకు నిధులు అందించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేదలు ఇళ్లు నిర్మించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.2 లక్షలు మంజూరు చేస్తుందని , అయితే ఎన్నికల కమిషన్ అనుమతించలేనందున ఎన్నికల తరువాత తాము ఇళ్లు నిర్మిస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.