Wednesday, November 20, 2024

Delhi | తెలంగాణ నేతకారులకు కేంద్రం సాయం.. దేశవ్యాప్తంగా 68 మందిలో 33 మంది ఇక్క‌డి వారే!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: చేనేత రంగంలో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన నేతలన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 68 మందిని ఎంపిక చేసి.. వారి ఖాతాల్లోకి నిధులను రెండు విడతల్లో విడుదల చేసింది. ఇందులో భాగంగా.. తెలంగాణ నుంచి 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో హైదరాబాద్ వీవర్ సర్వీస్ సెంటర్ కింద ఉన్న 33 మంది అవార్డు పొందిన నేతన్నలకు కేంద్ర జౌళి శాఖ రూ. 30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.

ఇందులో తెలంగాణకు చెందిన 33 మంది ఖాతాల్లోకి ఒక్కొక్కరి అకౌంట్లోకి.. నెలకు రూ. 8వేల చొప్పున సంవత్సరం మొత్తానికి కలుపుకుని రూ.96 వేలు ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) ద్వారా జమైంది. దేశవ్యాప్తంగా 68 మంది లబ్ధిదారుల అకౌంట్లలోకి రూ. 62లక్షల జమ చేయగా.. ఇందులో సింహభాగం.. రూ. 30 లక్షలు తెలంగాణకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లోకే జమయ్యాయి.

ఈ విధంగా నేతన్నల సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా, అన్ని రకాల పండుగలకు, శుభకార్యాలకు స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ‘వోకల్ ఫర్ లోకల్’ పేరిట స్వయానా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం నేతన్నల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement