Friday, November 22, 2024

బాయిల్డ్‌ రైస్‌ కొనేది లేదు.. కేంద్రం ప్రకటనతో పొలిటికల్​ హీట్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధాన్యం కొనుగోళ్ల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశం అగాధం సృష్టిస్తోంది. వివాదాలు ముదురుతూ వాద ప్రతివాదనలు జోరుగా జరుగుతున్న కీలక సమయంలో బుధవారంనాడు ఉప్పుడు బియ్యంపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. దీంతో ధాన్యం సేకరణ అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణపై తీవ్ర పోరాటం చేస్తుండగా, ఇదే సమయంలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ రాతపూర్వక సమాధానం అగ్గిమీద గుగ్గిలంగా మారుతోంది. కాగా ఇప్పటికే కేంద్రమంత్రి పీయూస్‌ గోయల్‌ ఒప్పందం మేరకు రాష్ట్రంలో రా రైస్‌ సేకరిస్తామని పేర్కొనగా, మరో కేంద్ర మంత్రి విరుద్ద ప్రకటనతో అయోమయం నెలకొంది.

ఉప్పుడు బియ్యం కొనేదిలేదని కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేసింది. లోక్‌సభలో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమివ్వడంతో కేంద్ర వైఖరి స్పస్టమైపోయింది. అవసరాల రీత్యా రాష్ట్రాలు బాయిల్డ్‌ రైస్‌ సేకరింఉకోవాలని సూచించారు. ఇకపై బాయిల్డ్‌ రైస్‌ సేకరించేదిలేదన్న విషయాన్ని గత ఖరీఫ్‌లోనే చెప్పినట్లుగా కేంద్రం పేర్కొంది. 2020-21ఖరీఫ్‌లో 47.49లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించినట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 6.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి బియ్యాన్ని సేకరించినట్లుగా పార్లమెంట్‌లో ప్రకటించారు.

బియ్యం సేకరణలో కేంద్రం మళ్లి తీవ్ర పేచీలు పెడుతోంది. కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌ సేకరణలో (సీఎమ్మార్‌) సేకరనలో రకరకాల నిబంధనలతో ఇబ్బందులు సృష్టిస్తోంది. బాయిల్డ్‌ రైస్‌ వద్దంటూ పేర్కొంటూ వచ్చిన కేంద్రం ఇప్పుడు పోర్టిఫైడ్‌ రైస్‌(ఒక శాతం సూక్ష్మ పోషకాలు, 99శాతం బియ్యం మిశ్రమం) ఇవ్వాలని చెబుతోంది. అయితే సీఎమ్మార్‌లో బాయిల్డ్‌ రైస్‌ 50శాతం, ఫోర్టిఫైడ్‌ రైస్‌ 50శాతం ఇవ్వాలని కోరుతూ సివిల్‌ సప్లై శాఖకు కేంద్ర ప్రభుత్వంలోని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) లేఖ రాసింది. కేంద్రానికి ఫోర్టిఫైడ్‌ బియ్యం అవసరమైతే ముందుగానే సమాచారం ఇవ్వాలి. కానీ ఎఫ్‌సీఐ అందుకు భిన్నంగా వ్యవహరించి ఆదేశాలు వెల్లడించింది. సీఎమ్మార్‌ డెలివరీ తర్వాత కొత్త ఆంక్షలు విధిస్తూ వస్తోంది. గతంలో పోర్టిఫైడ్‌ బియ్యం ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లు కేంద్రానికి స్పష్టం చేశారు. ఫోర్టిఫైడ్‌ రైస్‌ తయారు చేసే సామర్ధ్యం ఇక్కడ లేదని, ఆ పరికరాలు ఖర్చుతో కూడుకున్నవని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కేంద్రం ఫోర్టిఫైడ్‌ రైస్‌ కావాలని ఒత్తిడి తెస్తోందని అంటున్నారు. బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేది లేదని చెబుతున్న కేంద్రం 2020-21 యాసంగిలో 63లక్షల టన్నుల సీఎమ్మార్‌ ఇవ్వాల్సి ఉండగా, అందులో బాయిల్డ్‌ రైస్‌ కేవలం 24.75లక్షల టన్నులను మాత్రమే తీసుకుంటామని కేంద్రం పేర్కొంది.

ఈ కోటాను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో అనేక పోరాటాలు చేసింది. సీఎం కేసీఆర్‌, పలువురు మంత్రులు ఉన్నతస్థాయిలో ఢిల్లిలో పర్యటించి పార్లమెంట్‌లో ఎంపీలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో మరో 20లక్షల టన్నులు బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్రం నిర్దేశించిన 44.75 లక్షల టన్నుల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 39లక్షల టన్నులకుపైగా బాయిల్డ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐకి అందించింది. కేంద్రం ఇచ్చిన కోటా మేరకే ఇంకా 5.65లక్షల టన్నుల బాయిలడ్‌ రైస్‌ ఇవ్వాల్సి ఉండగా ఇందులో సగం ఫోర్టిఫైడ్‌ రైస్‌ కావాలని ఒత్తిడి చేస్తున్నారు. మొత్తం 63లక్షల టన్నుల సీఎమ్మార్‌లో 44.75లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌పోగా మరో 18.25లక్షల ముడి బియ్యం ఇవ్వాల్సి వస్తోంది. కానీ యాసంగిలో బాయిలడ్‌ రైస్‌ వస్తున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. సీఎమ్మార్‌ గడువు కూడా ముగియడంతో ఈ ఆందోళన తీవ్రమవుతోంది.

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సెగ పెంచుతోంది. రోజుకోమాటతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని అవమానిస్తున్నట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది. రాష్ట్రాలు తాము సేకరించిన బియ్యాన్ని స్థానిక అవసరాలకు తగినంత వాడుకొని మిగిలిన మొత్తాన్నే కేంద్రానికి ఇచ్చేలా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం జరిగిందని కేంద్రం చెబుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగ డిమాండ్‌ దృష్ట్యా ముడి బియ్యాన్ని మాత్రమే అందిస్తామని తెలంగాణ చెప్పిందని పేర్కొంటోంది. అయితే ఇలా సొంత అవసరాలకుపోగా మిగిలిన బియ్యాన్ని ముడి రూపంలో కొనుగోలుకు సిద్దంగా ఉన్నట్లుగా కేంద్రం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజనూ కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని, లేనిపక్షంలో కనీస మద్దతు ధరకు అర్ధమే లేదని సీఎం కేసీఆర్‌ ప్రధాని మోడీకి లేఖ రాశారు.

- Advertisement -

రైతులకు అన్యాయం చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయితే రోజుకో ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశం తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఎటువంటి స్పష్టత రాకపోవడంతో రైతాంగంలో నిరాశ అలుముకుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రమే స్వయంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. అనంతరం నిల్వకు ఉన్న సామర్ద్యం, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం భేరీజు వేసుకుంటోంది. వచ్చే ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకున్న తర్వాత ఒక స్పష్టమైన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నట్లు సమాచారం. రైతుల సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పూనుకోనున్నదని, ఇందుకు విప్లవాత్మక ప్రకటన చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లిలో పార్లమెంట్‌ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తెస్తుండగా, తాజాగా సీఎం కేసీఆర్‌ కూడా మరోసారి ఢిల్లికి వెళ్లి పరిస్థితిని వివరించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర వైఖరికి అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement