మంత్రి కేటీఆర్‌తో ఆంధ్రప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలు…
ప్ర: నియోజకవర్గాల సమీక్షల ద్వారా ఏ ఫీడ్‌బ్యాక్ లభించింది?
కేటీఆర్: మొత్తం 103 నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు శనివారంతో ముగిశాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు, ఎమ్మెల్యేలు ఇతరత్రా బాధ్యతల్లో ఉన్న కారణంగా 16 నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిం చలేదు. ఈనెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన తర్వాత వాటిని పూర్తిచేస్తాం. నియోజకవర్గ సమీక్షా సమావేశాలను పార్టీ పిలుపును క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళాలని నిర్వహించాం. 103 నియోజకవర్గాల నుండి సుమారు 5వేల మంది ఈ ఆరురోజుల్లో తెలంగాణభవన్‌కు వచ్చారు. ఈ ఐదువేల మంది తమ నియోజక వర్గాలకు, మండలాలకు వెళ్ళి సమావేశాలు నిర్వహించి నవంబర్ 15న విజయవర్జన సభ జయప్రదానికి కృషిచేస్తారు. 25న ప్లీనరీకి హాజరవుతారు. ప్రతి పల్లె కదిలేలా, ప్రతి వార్డు నుండి ఉత్సాహంగా కార్యకక్తలు హాజరయ్యేలా ఈ సమీక్షా సమావేశాలు కీలక భూమిక పోషిస్తాయి. సమీక్షల సందర్భంగా పలు మంచి సూచనలు వచ్చాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల మాదిరిగా ‘వ్యవసాయ ప్రగతి’ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని, దీనిద్వారా రైతులు పార్టీకి మరింత సన్నిహితం అయ్యేందుకు వీలు కలుగుతుందనే సూచన వచ్చింది. రైతుల కోసం రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలతో పాటు సాగునీరు, ఉచితకరెంట్ ఇలా ఎన్నో చేశాం. ఈ నాడు 63లక్షల మంది రైతులకు రైతు బంధు అందుతోంది. అదే విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లకు 8వేల కోట్లు ఖర్చుచేశాం.. వీటిని గుర్తుచేయాలి. కేసీఆర్ కిట్ లబ్ధిదారులతో ఆడబిడ్డల ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నాయకులు సూచించారు.
ప్ర: టిఆర్‌ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల ప్రత్యేకత ఏంటి?
కేటీఆర్: ఎన్నో ఉన్నాయి. కేసీఆర్ పిడికిలెత్తే వరకు తెలంగాణకు నోరు లేదు.. నీరు లేదు. కేసీఆర్ పిడికిలెత్తి గులాబీజెండా పట్టాకే.. తెలంగాణలో మార్పువచ్చింది. ఉద్యమం, రాష్ట్ర సాధన నుండి పరిపాలన దాకా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ సాధించిన విజయాలు అపూర్వం. అనితరసాధ్యం. తెలంగాణకు సొంత గొంతుకే శ్రీరామరక్ష. ఇతర పార్టీలకు 28 రాష్ట్రాల్లో ఒకటి. మాకు మాత్రం ఒక్కటే తెలంగాణ. రెండు దశాబ్దాల్లో టీఆర్‌ఎస్ సాధించిన విజయాలు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకప్పుడు సినిమాల్లో కూడా అవహేళన చేయబడ్డ బాష ఇపుడు హీరో బాషగా, పాపులర్ బాషగా మారింది. ఇదంతా టీఆర్‌ఎస్ సాధించిన విజయాలే. ప్రతీ రంగంలోనూ తెలంగాణ ఘన విజయాలు నమోదుచేయడానికి టీఆర్‌ఎస్సే కారణం. ఈ ప్లీనరీలో పలు తీర్మానాలు ఆమోదించడంతో పాటు పార్టీని మరింత పటిష్టపరిచేందుకు కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్రంలోని 16,395 యూనిట్ల నుండి వరంగల్‌లో నవంబర్ 15న జరిగే సభకు ఉవ్వెత్తున కదలాలి. ఆ దిశగా ప్లీనరీలో దిశానిర్దేశం చేస్తాం. 25న అధ్యక్షపదవికి ఎన్నిక పూర్తయిన తర్వాత ప్లీనరీ, తీర్మానాలు ఉంటాయి.
ప్ర: ప్లీనరీ ఏ తీర్మానాలు ఉండబోతున్నాయి?
కేటీఆర్: ప్లీనరీలో ఏడుతీర్మానాలు ఉండే అవకాశముంది. మొదట పార్టీ సాధించిన విజయాలు, రెండవది దళితబంధు, మూడవది పున్వర్వవ్యస్థీకరణ చట్టం, కేంద్రం చేసిన మోసాలపై చర్చిస్తాం. కేంద్రం తెలంగాణను దారుణంగా వంచించింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పునర్విభజన చట్టంలో ఉంది. దేశంలో వాటి అవసరం లేదని మాకు చెప్పారు. ఎక్కడా ఇవ్వమన్నారు. 2016లో లాతూర్ లో శంఖుస్ధాపన చేసి 2018లో పూర్తిచేశారు. ప్రధానిని 2017లో మిషన్‌ం భగీరథ ప్రారంభానికి ఆహ్వానించి ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. గడ్కరీని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేస్తే దేశంలో ఏ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వట్లేదు అని చెప్పారు. గత ఏడాది కర్నాటకలోని భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చారు. తెలంగాణకు నలుగురు యాక్సిడెంట్ ఎంపీలున్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వమున్నా వారు ఏం సాధించలేదు. ప్రధానమంత్రే మా పథకాలను కాపీ కొడుతున్నారు. ఏదో దురుద్దేశాన్ని ఆపాదించేందుకు నేను ఈ మాట చెప్పడం లేదు. మాకు అభినందగా భావిస్తాం. పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్రంలో హడావుడి చేసే బీజేపీ నాయకులు గుర్తించాలి. బండి సంజయ్ లాంటి నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి అని అన్నారు.
ప్ర: ఇకపై పార్టీకే ప్రధమ ప్రాధాన్యమంటు న్నారు? కార్యకర్తల సంక్షేమానికి కొత్త కార్యక్రమాలు తీసుకోబోతున్నారా?
కేటీఆర్: ఇకనుంచి పార్టీకి, ప్రభుత్వ పాలనకు సమ ప్రాధాన్యం ఇస్తాం. పార్టీని దేశంలోనే బలమైన రాజకీయ సంస్థగా తీర్చిదిద్దుతాం. టీఆర్‌ఎస్ ఎవరికీ తలవంచదు. తెలంగాణ ప్రజలే మా బాస్‌లు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అన్ని స్థాయిల కమిటీలు పూర్తయ్యాయి. కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ప్లీనరీ, విజయ గర్జన సభ, సంస్థాగత శిక్షణా ఇలా తొమ్మిది నెలలు ఏకోన్ముఖంగా కార్యక్రమాలు ఉంటాయి. కార్యకరర్తల సంక్షేమానికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కొత్త కార్యక్రమాలు ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా పార్టీ క్యాడర్‌కు మరింత భరోసాగా ఉంటాం.
ప్ర: కొన్ని నియోజకవర్గాలలో గ్రూపులున్నాయి? బహుళ నాయకత్వం ఉంది. దీనిని ఎలా సమన్వయం చేస్తారు?
కేటీఆర్: బహుళ నాయకత్వం టీఆర్‌ఎస్ బలానికి సంకేతం. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నేతలు ముగ్గురు, నలుగురు ఉన్నారు. టీఆర్‌ఎస్ గెలిచే పార్టీ కాబట్టి.. టికెట్ వస్తే గెలుస్తామన్న నమ్మకం ఉంది కాబట్టి సహజంగా పోటీ ఉంటుంది. వీటిని సమన్వయం చేసి.. అందరినీ ఒప్పించి మెప్పించే సామర్ధ్యం పార్టీకి ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ చేతుల మీదుగా కల్యాణలక్ష్మి, రైతుబంధు చెక్కులు ఇచ్చే అవకాశం కల్పించాలని అడిగారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం.
ప్ర: పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిని తిట్టారని వివాదం జరుగుతోంది?
కేటీఆర్: మన రాష్ట్రంలో కొందరు ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకుంటున్నారు. అయినా మా వాళ్ళు చాల మంచోళ్ళు. సహనంతో ఉంటున్నారు. ఆఫీసులపై దాడులు చేయట్లేదు. మహారాష్ట్రలో లాగా కేసులు పెట్టట్లేదు. మాక్కూడా సహనానికి ఓ హద్దు ఉంటుంది.. కదా. అడ్డగోలుగా నోరుపారేసుకునేవాళ్ళకు.. తగిన రీతిలో జవాబిస్తాం. ప్రతీసారి క్యాడర్‌ను ఆపలేం కదా.
ప్ర: ఇటీవల సి ఓటర్ సర్వే ప్రజాగ్రహం ఎక్కువగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది?
కేటీఆర్: అదేం సర్వేనో.. అదేం నివేదికో వారికే తెలియాలి. 30శాతం ప్రజాగ్రహం అంటే మిగతా 70 శాతం అనుకూలమన్నట్లేనా? ఈ సంస్థ 2018లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పింది. మహాకూటమికి 62 సీట్లు వస్తాయని చెప్పింది. టిఆర్‌ఎస్ పార్టీ 85 స్థానాలు గెలిచింది. రోలర్లు, ట్రక్కులు లేకుంటే ఇంకో పదిసీట్లు ఈజీగా గెలుస్తాం. ఆ సంస్థ సర్వేలకు విశ్వసనీయత లేదు. చెత్త సర్వేలు.
ప్ర: హుజూరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉంది?
కేటీఆర్: వందశాతం గెలుస్తాం. కొందరు హుజూరాబాద్ కోసం దళితబంధు పెట్టారని అంటున్నారు. ఒక్క నియోజకవర్గం కోసం 1.70లక్షల కోట్ల పథకం ఎవరైనా తెస్తారా? ఇంకొందరు హుజూరాబాద్‌లో 2వేల కోట్లు ఖర్చుపెడతరా.. మూడువేల కోట్లు ఖర్చుపెడతరా? అంటున్నారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా.. హుజూరాబాద్‌కు 12వేలకోట్ల ప్యాకేజీ ప్రకటించండి.. ఎవరు అడ్డుకున్నారు. ఈటల రాజేందర్ అన్నీ ద్వంద ప్రమాణాలు. కేంద్రం నల్లచట్టాలు తెచ్చిందన్నాడు.. బీజేపీలో చేరంగనే అవి తెల్లచట్టాలు అవుతయా? రాజేందర్ గెలిస్తే పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గుతయా? 2003లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయనకు కేసీఆర్ రాజకీయ జన్మనిస్తే ఆపార్టీనే బొందపెడతా అంటున్నడు. అసైన్డ్ భూములు కబ్జాపెట్టిడండని కమిటీ వేస్తే నేను సీఎం కలవను. ఆ భూములు నావే అన్నడు. ఇంక ఏం చేస్తరు? కుంభకోణాల్లోంచి లీడర్లు పుట్టడం దురదృష్టకరం. రేవంత్ ఠాగూర్‌కు డబ్బులిచ్చి పిసిసి తెచ్చుకున్నాడన్న ఆరోపణలకు ఇద్దరూ స్పందించలేదు. టీఆర్‌ఎస్ ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అయినా విజయం టీఆర్‌ఎస్‌దే. కొందరు రాష్ట్రం పెట్రోల్, డీజిల్ ధరలుతగ్గించొచ్చు కదా అంటున్నారు.. అంటే మోడీ ధరలు పెంచుకుంటూ పోతుంటే రాష్ట్రం తగ్గించాలా? అర్ధంలేని వాదనలు తీసుకొస్తున్నారు. 30వ తేదీన జరిగే ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు వీళ్ళకు సరైన బుద్ది చెబుతారు.
ప్ర: ఎన్నికల సంఘం పరిధిని అతిక్రమించిందని ఆరోపిస్తున్నారు?
కేటీఆర్: అవును నిజం. ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమిస్తున్నట్టు కనబడుతున్నది. దళితబంధు ఆన్ గోయింగ్ స్కీం. వాసాలమర్రిలో లాంచ్ అయింది. హుజురాబాద్‌లో పైలట్‌గా నడుస్తున్నది. వేల మంది అకౌంట్లలో డబ్బులు పడినవి. మేము ధీమాగా ఉన్నామంటే ఆపితే, గీపితే వారం రోజులు అవుతుంది. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు ఇక్కడే ఎందుకు? ఉప ఎన్నిక జరిగే చోటే నిబంధనలు ఉంటాయి. పక్క జిల్లాలో కూడా ఉంటాయంటున్నారు. ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర ఇలా.. పక్క రాష్ట్రంలో కూడా ఆంక్షలు పెట్టమంటారేమో? కేసీఆర్ ప్రచారానికి వస్తే డిపాజిట్ కూడా రాదని వాళ్లు భయ పడుతున్నారు. కేసీఆర్ ప్రచారం ఆపాలని కుట్రలు చేశారు.