కరోనా చికిత్సతో ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్ మందును రాష్ట్రాలకు సరఫరా చేసే ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆ ఔషధం అవసరం ఉన్న రాష్ట్రాలు.. తామే స్వయంగా ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్రం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. రెమిడెసివర్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్యను నెల రోజుల్లోనే 20 నుంచి 60కి పెంచామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో రెమిడెసివర్‌కు ఉన్న డిమాండ్ కంటే ఎక్కువే ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. అయితే రెమిడెసివర్ లభ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీడీఎస్‌సీవో, జాతీయ మందుల ధరల ఏజెన్సీకి ఆయన సూచించారు.
అత్యవసర సమయంలో అందుబాటులో ఉండేలా 50లక్షల రెమ్‌డెసివిర్ వయల్స్‌ను కేంద్రం కొనుగోలు చేసి నిల్వ చేస్తుందని చెప్పారు. ఏప్రిల్ 11న రోజుకు 33వేల వయల్స్ ఉత్పత్తి సామర్థ్యముంటే.. ఇప్పుడది 3.50 లక్షలకు పెరగడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వమే రెమిడెసివర్ వయల్స్ పంపిణీని పర్యవేక్షించింది. రాష్ట్రాలకు కోటికి పైగా వయల్స్‌ను పంపించింది.