Friday, November 22, 2024

ట్విట్టర్‌పై కేంద్రం ప్రశ్నల వర్షం..

పార్లమెంటరీ ఐటీ స్థాయి సంఘం ఈరోజు భేటీ అయ్యింది. దీనికి ట్విట్టర్‌ ప్రతినిధులు సహా, కేంద్ర ఐటీ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. సోషల్‌ మీడియాలో పౌరుల భద్రత, ఆన్‌లైన్ వేదికల దుర్వినియోగం వంటి అంశాలపై ట్విట్టర్‌ను ప్రశ్నించడమే ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. కమిటీలోని బీజేపీ ఎంపీలు ట్విట్టర్‌ ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు.

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల్ని అమలు చేయడంలో ట్విట్టర్‌ చేస్తున్న జాప్యంపై ఆ సంస్థ ప్రతినిధుల్ని ఎంపీలు నిలదీసినట్లు సమాచారం. అలాగే భారత్‌లో ట్విట్టర్ విధానాలు ఇక్కడి స్థానిక చట్టాలకు లోబడి ఉండాలని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.దీనిపై స్పందించిన ట్విట్టర్‌ ప్రతినిధులు వీటికి సమాధానం ఇవ్వడానికి వారికి తగిన అధికారం లేదని.. త్వరలో రాతపూర్వకంగా సమాధానం పంపుతామని వెల్లడించారు.

ఇక కొత్త నిబంధనల అమలుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే, ఎప్పటి లోపు పూర్తిస్థాయిలో వీటిని అమలు చేస్తారన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారు.ఇక ట్విట్టర్‌లో అభ్యంతకర సందేశాలకు ఏ ప్రాతిపదికన ‘మేనిపులేటెడ్‌ మీడియా’ ట్యాగ్‌ ఇస్తారని ఎంపీలు ప్రశ్నించగా.. సమాజంలోకి తప్పుడు సందేశం తీసుకువెళ్లే వాటికి అలాంటి ట్యాగ్‌ ఇస్తామని ప్రతినిధులు బదులిచ్చారు. దీనికి తమకు ఓ విధానం ఉందని దాని ఆధారంగానే నడుచుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement