వానాకాలం వరి పంట దిగుబడిలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు 443.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ తెలిపింది. ఇందులో ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచే అత్యధికంగా 186.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఆ తర్వాతి స్థానాల్లో హర్యానా (55.30 ఎల్‌ఎమ్‌టీ), తెలంగాణ (52.88 ఎల్‌ఎమ్‌టీ), చత్తీస్‌గఢ్ (47.20 ఎల్‌ఎమ్‌టీ) రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర కల్పిస్తూ 47.03 లక్షల మంది రైతులకు రూ.86,924.46 కోట్ల మేర అందజేసినట్టు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు 52.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని, తద్వారా 7,84,363 మంది రైతులకు రూ.10,364.88 కోట్ల లబ్ధి చేకూరిందని కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తికాగా, 98,972 మంది రైతులకు రూ.1,504.47 కోట్ల మేర లబ్ధి జరిగిందని తెలిపింది. ధాన్యాన్ని సేకరించిన రాష్ట్రాల జాబితాలో పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్ము-కశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital