న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సాగరమాల పథకం కోసం ప్రతిభావంతులైన యువకులను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేవులు నౌకా నిర్మాణం, జలమార్గాల మంత్రిత్వ శాఖలో యువ నిపుణుల నియామకం కోసం ‘సాగరమాల యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా యువ నిపుణులకు క్షేత్ర స్థాయిలో నైపుణ్యం అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. శిక్షణ సమయంలో యువ నిపుణులకు ప్రభుత్వ పనితీరు తో పాటు సంబంధిత అభివృద్ధి విధానాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మంత్రిత్వ శాఖ అవసరాల మేరకు మౌలిక సదుపాయాలు, సమాచార విశ్లేషణ, ప్రాజెక్ట్ యాజమాన్యం , అంకుర సంస్థలు, వినూత్నత, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ మార్పిడి, పర్యావరణం వంటి రంగాలలో ఈ నిపుణులు సేవలు అందించాల్సి ఉంటుంది.
విధాన నిర్ణయాల్లో యువత చురుకైన పాత్ర పోషించేలా ఈ పథకం ఉపయోగపడుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పొందడం ద్వారా యువ నిపుణులు వీటి పరిష్కార మార్గాలను గుర్తించడానికి వీలవుతుంది. తొలుత ఈ పథకం కింద 25 మందికి పైగా యువ నిపుణులను నియమించనున్నట్టు కేంద్రం తెలిపింది. అభ్యర్థులు బీఈ, బిటెక్, బీ-ప్లానింగ్ లేదా ఎంబీఏ లేదా తత్సమాన డిగ్రీ విద్యార్హతలు కలిగి సంబంధిత సబ్జెక్ట్/ ఫీల్డ్‌లో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. అకౌంటెన్సీ, ఫైనాన్స్, లీగల్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్, డేటా అనలిటిక్స్‌లో నిపుణులను కూడా మంత్రిత్వ శాఖ అవసరాల మేరకు నియమించనున్నట్టు కేంద్రం తెలిపింది. తొలుత వీరిని 2 సంవత్సరాల పాటు నియమిస్తారు. పనితీరు ఆధారంగా అదనంగా మరో 2 సంవత్సరాలకు కాంట్రాక్ట్ పొడిగించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..