Tuesday, November 26, 2024

ఏపీకి కేంద్రం బిగ్ షాక్.. రుణపరిమితిలో ఎడాపెడా కోతలు

ఏపీలో భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం అదే స్ధాయిలో అప్పులనూ చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మరిన్ని అప్పులు చేస్తోంది. దీంతో కేంద్రం కూడా ఏపీ రుణ పరిమితులపై ఆంక్షలు విధిస్తోంది. గతేడాది కరోనా సందర్భంగా కొన్ని షరతులతో పెంచిన రుణ పరిమితిని ఈ ఏడాది కొనసాగించే పరిస్ధితి కనిపించడం లేదు. తాజాగా ఏపీ రుణ పరిమితిని పెంచాలని సీఎం జగన్ కోరినా కేంద్రం మాత్రం కరుణించలేదు.

ఏపీలో వైసీపీ సర్కార్ చేస్తున్న అప్పులతో రాష్ట్ర ఖజానా పరిస్ధితి ఇప్పటికే దారుణంగా తయారైంది. ఇలాంటి పరిస్ధితుల్లో కొత్తగా రూపాయి కూడా అప్పు పుట్టే పరిస్ధితులు కనిపించడం లేదు. ఎక్కడో చోట రుణం తెచ్చుకుందామన్నా కేంద్రం అడ్డుపుల్లలు వేస్తోంది. ఇప్పటికే ఏపీ అప్పులు దాదాపు నాలుగు లక్షల కోట్లకు చేరబోతున్నాయన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం తాజాగా ఏపీ రుణ పరిమితుల్లో భారీగా కోతలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్తగా అదనపు రుణాలు సేకరించేందుకు కూడా వీల్లేకుండా పోతోంది.

జగన్ అభ్యర్ధనకు కేంద్రం నో
ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏపీ రుణ పరిమితిని రూ.42742 కోట్లకు పెంచాలని కేంద్రాన్ని ఇప్పటికే జగన్ అభ్యర్ధించారు. తాజాగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయం ప్రస్తావించారు. అయినా కేంద్రం మాత్రం కరుణించలేదు. ఇప్పటికే ఏపీ భారీ ఎత్తున అప్పులు చేస్తుండటం, కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్, ఇతర సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాలతో రుణ పరిమితిని పెంచలేమని తేల్చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం కేంద్రం అనుమతించిన మేరకే రుణాలు తీసుకోవాల్సిన పరిస్ధితి.

ఏపీ రుణ పరిమితిలో ఎడాపెడా కోతలు
ఈ ఏడాది అప్పులు తెచ్చుకునే పరిమితిని రూ.42,742 కోట్లకు పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరినా కేంద్రం మాత్రం రూ.37,163 కోట్లకే దాన్ని పరిమితం చేసింది. ఆ తర్వాత రుణ పరిమితిలో మరోసారి కోతలు విధించి రూ.32,669 కోట్లకు పరిమితం చేసింది. తాజాగా మరోసారి దాన్ని ఇంకా తగ్గించి రూ.27,669 కోట్ల మేర మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు చెప్పడం రాష్ట్రానికి భారీ షాకిచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ మొత్తానికే పరిమితం కావాల్సి వస్తోంది. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నా రుణ పరిమితుల విషయంలోనూ ఎలాంటి సహకారం లభించలేదనడానికి ఇదే నిదర్శనం.

డిస్కంల ప్రైవేటీకరణతో కొత్త రుణాలకు లింక్
ఏపీకి గతంలో ఆమోదించిన రుణ పరిమితుల మేరకు కూడా అప్పులు తెచ్చుకునేందుకు నిరాకరిస్తున్న కేంద్రం.. తాజాగా కొత్త పాట పాడటం మొదలుపెట్టింది. సంస్కరణలు అమలు చేస్తేనే కొత్త రుణాలకు ఆమోదం ఇస్తామని షరతులు పెడుతోంది. ఇందులోనూ విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే రూ.5800 కోట్ల మేర రుణాలకు అనుమతులిస్తామంటోంది. అయితే అదనపు రుణం కోసం సంస్కరణల్లో భాగంగా డిస్కం లను ప్రైవేటీకరించాలని షరతు పెట్టింది. డిస్కంలు ప్రైవేటీకరిస్తే జనంపై ఎడాపెడా విద్యుత్ ఛార్జీల మోత తప్పదని ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది.

- Advertisement -

ఇది కూడా చదవండి: ఏపీలో త్వరలో ఆర్గానిక్ పాలసీ

Advertisement

తాజా వార్తలు

Advertisement