ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం ఖరారు చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నూతన కనీస మద్దతు ధరలకు ఆమోదం లభించింది. ధాన్యం క్వింటాల్‌కు రూ.72 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరతో ఇకపై క్వింటాల్‌కు రూ .1,940 దక్కనుంది. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటల రేట్లను కూడా ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ కాలానికి సాధారణ వర్షపాతమే ఉండనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. పంటల కనీస మద్దతు ధరలపై తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు పెంచినట్లు భవిష్యత్తులో కూడా ఇది కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. కనీస మద్దతు ధరలపై ఉన్న రైతుల భయాలను తొలగించినట్లు చెప్పారు. గత ఏడాది వరి క్వింటాల్‌కు రూ.1,868 ఉండే. కాగా 2021-22 పంట కాలానికి వరికి కనీస మద్దతు ధరను మరో రూ.72 పెంచి రూ.1,940 చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సజ్జలు క్వింటాల్‌కు గతేడాది రూ.2,150 ఉండగా ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2,250 అందనున్నట్లు తెలిపారు. పంటలకు క్రమం తప్పకుండా మద్దతు ధరలు పెరుగుతూనే ఉంటాయని వారి ఫలితాలు రైతులకు అందనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.