దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడగించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. దక్షిణ, ఈశాన్యంలోని పలు ప్రాంతాలకు మినహాయింపును ఇచ్చింది. ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మాట్లాడుతూ.. కొత్త కరోనా కేసులు తగ్గుతున్నాయని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందన్నారు. ఈ మేరకు నియంత్రణ చర్యలు కచ్చితంగా కొనసాగించడం చాలా ముఖ్యమన్నారు.
స్థానిక పరిస్థితులు, అవసరాలు, వనరులను అంచనా వేసిన తర్వాత రాష్ట్రాలు, యూటీలు ఏదైనా సడలింపులను తగిన సమయంలో, గ్రేడెడ్ పద్ధతిలో పరిగణించవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 29న జారీ చేసిన మార్గదర్శకాలు జూన్ 30 వరకు కొనసాగుతాయని చెప్పారు. మార్గదర్శకాల మేరకు ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి. ఐసోలేషన్ వసతులతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. అయితే తాజా మార్గదర్శకాల్లో లాక్‌డౌన్‌పై హోంశాఖ ఎలాంటి ప్రస్తావన చేయలేదు.