Friday, November 22, 2024

వికలాంగుల సంక్షేమానికి కేంద్ర నిధులు.. ఎస్‌ఐపీడీఏ నిధులపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వికలాంగుల పునరావాస పథకం కింద 11 రాష్ట్రాలు నిధులు అందుకున్నాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వెల్లడించారు. వికలాంగుల సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టేందుకు, ఆర్థిక సాయం అందించడానికి నిర్దేశించిన వికాలాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన పథకం నిధుల (ఎస్‌ఐపీడీఏ) గురించి మంగళవారం లోక్‌సభలో నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ బదులిస్తూ… 2020-21 నుంచి ఈ పథకం కింద ఉన్న మిశ్రమ ప్రాంతీయ కేంద్రాలు, జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాలను తొలగించి దీనదయాల్‌ వికలాంగుల పునరావాస పథకం (డీడీఆర్‌ఎస్‌)తో అనుసంధానించినట్టు వెల్లడించారు.

ఈ పథకానికి రూ.77.50కోట్లు కేటాయింపులు చేసినట్లు వివరించారు. 2019 – 20, 2020 – 21, 2021 – 22 ఆర్థిక సంవత్సరాల్లో రూ.42.50 కోట్ల కేటాయింపులు చేసినట్లు తెలిపారు. వికలాంగులకు పునరావాసం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు పథకంలోని నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్వయంప్రతిపత్తి సంస్థలు, విశ్వవిద్యాలయాలతో సహా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థలకు నిధులందిస్తున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. 2017 – 18 నుంచి ఇప్పటి వరకు 11 రాష్ట్రాలు మాత్రమే దరఖాస్తు చేసుకుని, నిధులు కూడా అందుకున్నాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement