న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెనుకబడిన వర్గాల హక్కుల కోసం అన్ని ప్రాంతాల బీసీలు సమష్టి కృషితో పోరాటం చేయాలని, ఆ దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీ సెంట్రల్ ఓబీసీ కమిటీ ఆధ్వర్యంలో ప్రకాష్ వర్మ నేతృత్వంలో జ్యోతిభాఫూలే మార్గ్ లోని సంఘ్లీ మెస్ కాలనీలో గురువారం ఓబీసీ హక్కుల సాధన సదస్సును నిర్వహించారు. దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలపై ప్రభుత్వానికి చిన్న చూపెందుకని సమావేశంలో పాల్గొన్న వారు ప్రశ్నించారు.
విద్య, ఉద్యోగ,వాణిజ్య , వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ రంగాల రిజర్వేషన్లలో ఓబీసీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అన్ని రాష్ట్రాల్లో కమిటీలు వేస్తున్నట్టు దాసు సురేష్ తెలిపారు. భవిష్యత్తులో ఢిల్లీ కేంద్రంగా అనేక కార్యక్రమాలను ఉద్ధృతంగా నిర్వహించనున్నామని, ఈ దిశగా 11 మందితో కూడిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ సెంట్రల్ కమిటీని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..