న్యూ ఢిల్లీ – 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 23న కేంద్ర బడ్జెట్ ను లోక్ సభ లో ప్రవేశపెట్టనున్నారు.. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు.
ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పించారు.
2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.