న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బాలల హక్కుల పరిరక్షణలో చేసిన విశేష కృషికిగానూ బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంటేరియన్స్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ (పీజీసీ) అవార్డు ఆయనకు దక్కింది. గురువారం న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో 2021-22 సంవత్సరానికిగానూ పార్లమెంటేరియన్స్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ ఛైర్మన్ గోగాయి చేతుల మీదుగా బడుగుల లింగయ్య యాదవ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఆయన కేంద్ర బొగ్గు, ఉక్కు స్టాండింగ్ కమిటీ, రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. బాలలకు సంబంధించిన పోక్సో చట్టం సవరణ బిల్లు- 2019 సంబంధించి ఆయన అనేక సూచనలు చేశారు. అలాగే బాలల విద్య, పాఠశాలల్లో యోగా క్లాసుల నిర్వహణ, తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు తదితర బాలల హక్కుల గురించి ఎంపీ లింగయ్య యాదవ్ పలుమార్లు పార్లమెంట్‌లో లేవనెత్తారు.