Friday, November 22, 2024

ధ‌ర‌ణి ఆద‌ర్శంగా కేంద్రం చ‌ట్టం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధరణి పోర్టల్‌తోపాటు, నూతన రెవెన్యూ చట్టంతో భూ హక్కులకు పారదర్శకత రావడంతో రాష్ట్రంలో భూ పరిపాలన గాడిలో పడిన సంగతి తెలిసిందే. అయితే విపక్షాలు తాము అధికారంలోకి వస్తే… ధరణి రద్దు చేస్తామనే ప్రకటన నేపథ్యంలో మరోసారి కంక్లూజివ్‌ టైటిల్‌ యాక్టు చట్టంపై రాష్ట్రంలో ఎక్కడ చూసినా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చట్టం అమలుపై 2008 ఆగస్టు 21న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించింది. అప్పట్లో అన్ని రాష్ట్రాలు తమ భూ వ్యవహారాలు, రెవెన్యూ చట్టాల్లో ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలను మార్చుకుని ఈ యాక్టు దిశగా దృష్టి సారించాలని కోరుతూ డ్రాఫ్ట్‌ ముసాయిదాను రూపొందించింది. ఈ తరహా చట్టం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూకే, అమెరికా, కెనెడా, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, మలేషియా వంటి దేశాల్లో అమలు చేస్తున్నారు. కానీ దేశంలో 1908 నాటి రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం ఆస్తులు, భూములపై పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కుల కల్పన జరగడం లేదు. కేవలం ఆస్తుల మార్పిడి పత్రాలుగానే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు మిగిలిపోతున్నాయనే అపవాదు వస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ భూ విధానాలకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ దిశలో గతంలో ప్రతిపాదించిన టైటిల్‌ యాక్టును పరిశీలిస్తోందని తెలిసింది. రాష్ట్రాలలో భూ రికార్డులకు రెవెన్యూ శాఖ, ఆయా భూముల మ్యాపులు, హద్దులు, విస్తీర్ణాలకు సర్వే సెటిల్‌మెంట్‌ శాఖ, భూముల రిజిస్ట్రేషన్లకు రెవన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల వంటి రకరకాల వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థలను ఏకీకృతం చేసి ఒక గొడుగు కిందకు తెచ్చి భూ యజమానులకు వారి ఆస్తులు, భూములపై స్వతంత్య్ర వ్యవస్థ ద్వారా యాజమాన్య హక్కులను కల్పించాలని కేంద్రం యోచిస్తోంది.


కంక్లూజివ్‌ యాక్టులో…

  • ఎప్పటికప్పుడు రికార్డుల్లో మార్పులు, చేర్పులు వెంటనే జరగాలి
  • గత రికార్డుల్లో యాజమాన్య హక్కులను వెంటనే మార్చి క్రయవిక్రయాలు జరగగానే కొనుగోలుదారు పేరు యాజమాన్య కాలమ్‌లో చేరాలి
  • ఆక్రమణలకు గురైతే పరిహారం, ఇన్ష్యూరెన్స్‌ అందించాలి
    ఈ నాలుగు ప్రధానాంశాలుగా కంక్లూజివ్‌ టైటిల్‌ యాక్టు సిద్దం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం కూడా అనేక రాష్ట్రాల్లో ఒకే పని మూడు నాలుగు ప్రభుత్వ శాఖలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో మ్యుటేషన్ల బాధ్యత స్థానిక సంస్థలు అమలు చేస్తున్నాయి. పట్టణ స్థానిక సంస్థలు కొన్ని రాష్ట్రాల్లో ఆస్తిపన్ను వసూలుకు ఎప్పటికప్పుడు ఆస్తుల యాజమాన్య హక్కులను మార్చే అధికారం కల్గి ఉన్నాయి. అయితే అనేక రాష్ట్రాల్లో రెవెన్యూ రికార్డుల్లో మార్పులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయకపోవడంతోనే సమస్యలు పెరుగుతున్నాయని కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ పేర్కొంది.
    ఈ కొత్త చట్టం అమలుతో ఆస్తులు, భూముల వివరాలు, రికార్డుల నిర్వహణ, పన్నుల వసూలు, రాబడికి సులభమవుతుంది.
  • ఆస్తుల వివరాలు, భూ సంబంధిత యాజమాన్య హక్కుల వివరాలు కంప్యూటరీకరణతో పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టడం ద్వారా ప్రజలకు సులువుగా సమాచారం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
  • కంప్యూటర్‌ రికార్డులు ఎప్పటికప్పుడు సవరించడం, అప్‌డేట్‌ చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది.
  • వివాదాలు ఉన్న ఆస్తులు, భూముల యాజమాన్య హక్కుల కల్పనకు అవకాశం లేకపోవడంతో ట్యాంపరింగ్‌కు అవకాశాలు లేకుండా పోతాయి.
  • రికార్డులు ఎప్పటికప్పుడు మార్పులు సంతరించుకునే అవకాశంతో మ్యుటేషన్లలో జాప్యం తొలగించొచ్చు.
  • స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుముల వంటి వివరాలకు వెబ్‌సైట్‌లో మార్కెట్‌ విలువ ఆధారంగా చెల్లించుకునే వీలు కల్గనుంది.
  • తద్వారా భూ సేకరణలు, విపత్తు నిర్వహణ, పునరావాసం, రుణ సమీకరణ వంటి అనేక అంశాలకు మరింత సులభమైన విధానం దీంతో సాకారం కానుంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement