ప్రభన్యూస్, హైదరాబాద్ : మహానగరంలో వర్షాలు షురూ అయ్యాయి. దీంతో నగరవాసుల్లో భయం వెంటాడుతోంది. ఎందుకంటే గత సంవత్సరం వరణుడు సృష్టించిన బీభత్సం ఇంకా తమ కళ్లముందు కదలాడుతుందని జనం వాపోతున్నారు. గత 2020, 2021 సంవత్సరాల్లో కురిసిన వర్షాలు నగరవాసులను భయకంపితులను చేశాయి. మహానగరంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతేడాది వరదల కారణంగా హామిలు ఆచరణకు నోచుకోకపోవడంతో నీటి మూటలను తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ ఉప్పొంగి ప్రవహించడం పరిపాటిగా మారింది. దీనికి గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులు జరుగుతున్నా.. సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. రాత్రి సమయంలో మ్యాన్‌హోల్ ఉప్పొంగితే పట్టించుకున్న నాథుడే ఉండటం లేదనే ఆరోపణలున్నాయి.
వాటర్‌బోర్డులో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) విభాగం మురుగునీటి పారుదలతో పాటు మంచినీటి సరఫరాను పర్యవేక్షిస్తుంది. బోర్డులో ఈ విభాగానికి ఇద్దరు డైరెక్టర్లున్నారు. వీరిలో ఒకరు కోర్‌సిటీని పర్యవేక్షిస్తుండగా మరొకరు అవుటర్ రింగ్ రోడ్డు వరకు (ఓఆర్‌ఆర్) వరకు ఉన్న శివారు మున్సిపాల్టిలు, గ్రామాల్లో మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కోర్‌సిటిలోనే దాదాపు 2.54 లక్షలకు పైగా మ్యాన్‌హోల్స్ ఉండగా, శివారు మున్సిపాల్టిల్లోని దాదాపు 66 వార్డుల్లో సుమారు 3,600 కి.మీ సెవరేజీ పైపులైన్ వ్యవస్థతో పాటు 3.26లక్షలకు పైగా మ్యాన్‌హోళ్ల నిర్వహణను వాటర్‌బోర్డు పర్యవేక్షిస్తుంది. దీనికీ తోడు ప్రస్తుతం కోర్‌సిటీలోనే దాదాపు 1400లకు పైగా ఎంఎల్డిల మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. ఓఆర్‌ఆర్ వరకు దాదాపు 1750ఎం ఎల్డిల వరకు మురుగు ఉత్పత్తి అవుతుం దని అంచనాలున్నాయి. అయితే ప్రస్తుతం కోర్‌సిటీలో ఉత్పత్తి అవుతున్న మురుగును 25 ఎస్టీపీల ద్వారా కేవలం 772 ఎంఎల్డిల మురుగునీటిని శుద్దిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా మురుగునీరు ప్రధానరోడ్లపై పరుగులు పెడుతుండగా వర్షాకాలంలో మరింత ప్రమాదంగా మారుతుండటం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.