Friday, November 22, 2024

రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా కేంద్రం ఆలోచనలు.. న్యాయకోవిదుడినే గవర్నర్​గా నియామకం: రఘురామ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని గ్రహించే కేంద్ర పెద్దలు రాజకీయ నాయకుణ్ని కాకుండా రాజ్యాంగ కోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర గవర్నర్‌గా నియమించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో గవర్నర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సత్కరించారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అరగంట పాటు అబ్దుల్ నజీర్‌తో గడిపిన రఘురామ పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం ఆయన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ… ఏపీలో మరికొన్ని నెలల పాటు తాను గవర్నర్‌ను కలిసే పరిస్థితి లేదని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ తనని చూడడానికే జడుసుకుంటున్నారని అన్నారు. తనను రాష్ట్రంలో అడుగు పెట్టనిచ్చేదే లేదని ముఖ్యమంత్రి భీష్మించుకు కూర్చున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్న రఘురామకృష్ణ, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని జోస్యం చెప్పారు. రాజ్యాంగ కోవిదుడైన వ్యక్తిని రాష్ట్ర గవర్నర్‌గా నియమించడం శుభ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును పునరుద్ధరించి దాత పేరును తొలగించి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

సలహాదారులు చెప్పే మాటలు వినకుండా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును పునరుద్ధరిస్తే మంచిదని హితవు పలికారు. కళాక్షేత్రానికి దాత పేరును తొలగించడం ద్వారా జగన్ సమాజానికి ఇస్తున్న సందేశమేంటని ఆయన ప్రశ్నించారు. మహాకవి క్షేత్రయ్య పేరిట తుమ్మలపల్లి హరి నారాయణ, అన్నపూర్ణమ్మ దంపతులు 1940లో సామాన్యుల వద్ద వంద రూపాయలు కూడా లేని రోజుల్లో 40 వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి ప్రజల సౌకర్యార్థం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నిర్మించారని రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement